తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా… కల్వకుంట్ల తారక రామారావు నియమితులయ్యారు. పార్టీ పూర్తి బాధ్యతలను కేటీఆరే చూసుకుంటారని.. కేసీఆర్ కూడా.. మరో అభిప్రాయానికి తావు లేకుండా ప్రకటించారు. అంటే.. ఇక టీఆర్ఎస్లో ఏ టూ వై కేటీఆరే. అంతిమంగా ఏదైనా పరిష్కరించాల్సి వస్తే బిగ్‌బాస్‌గా.. కేసీఆర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జెడ్. ఆ తర్వాత ఇంకేమీ లేదు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత టీఆర్ఎస్లోని కొంత మంది సీనియర్ల దగ్గర్నుంచి ప్రకటనలు వచ్చాయి. కేటీఆర్ నేతృత్వంలో పార్టీ మరింత పురోగమిస్తుందని.. అభివృద్ధి సాధిస్తుందని.. ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సీనియర్లు ఎవరో కాదు… పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లే.
వీరే కాదు.. ఎన్టీఆర్ టైంలో టీడీపీ లోకి వచ్చి.. ఎన్టీఆర్‌కు జైకొట్టిన నేతలు.. ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్లి కేటీఆర్‌కు జై కొట్టాల్సిన పరిస్థితి చాలా మందికి వచ్చింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని… తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలను చూస్తే అర్థమైపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు… ఎన్టీఆర్‌తో కలిసి ప్రజాజీవితంలో అడుగు పెట్టినప్పుడు… కల్వకుంట్ల తారక రామారావుకు బహుశా… పుట్టి ఉండరు. కానీ.. ఇప్పుడు.. ఆయన నాయకత్వంలో పని చేయాల్సి వస్తోంది. తను ఉన్న పార్టీని ఆయన బలోపేతం చేస్తారని.. ప్రకటనలు చేయాల్సి వస్తోంది. ఆ నేత ప్రాపకం కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తోంది.
నాడు ఎన్టీఆర్ కరుణాకటాక్షాల కోసం ప్రయత్నించిన వారు టీఆర్ఎస్లో ఇప్పుడు ఎందరో. వారంతా ఇప్పుడు.. కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ లో వేణుగోపాలా చారి నుంచి ప్రారంభించి ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు వరకూ వీరి జాబితా పెద్దగానే ఉంటుంది. ఇంకా విశేషం ఏమిటంటే.. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో… తిరుగులేని అధికారం అనుభవించిన వారే. నాడు ఎన్టీఆర్‌తో పని చేసిన వాళ్లు.. నేడు కేటీఆర్‌తో పని చేయాల్సి వస్తోంది. ఈ సీనియర్ల పరిస్థితి చూస్తే..ఏదీ అసాధ్యం కాదు…అని నిరూపితమవుతోంది.