విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంవత్సరం ఇది. ఆయన తొలి సినిమా మనదేశం 1949లో విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన సినీ నట వజ్రోత్సవాల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ‘తారకరామం-అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ సినీ జీవిత ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, ఇంటర్వ్యూల్లో ఆయనే చెప్పిన విశేషాలు, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భిన్నపాత్రల్ని సమర్థంగా నిర్వహించిన తీరుపై ఆయనతో పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు, పాత్రికేయులు, రచయితలు వెల్లడించిన అంశాల సమాహారంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరిక చేశారు ఎన్టీఆర్. ఆ సమయంలో జరిగిన ఓ గమ్మత్తయిన కథని స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించడం ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఆ ముచ్చట స్వయంగా ఎన్టీఆర్ మాటల్లో..’కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు ఆడవేషం వేయమంటే ఎక్కడలేని పౌరుషం వచ్చేది. వేడి, వాడి గల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాస్టారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం..అదో గమ్మత్తు కథ. రాచమల్లుని దౌత్యంలో నాగమ్మపాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండానే ఆ పాత్ర ధరిస్తానని భీష్మించాను. అలా భీష్మించే అలవాటు అప్పటికీ, ఇప్పటికీ నాలో ఉంది’
‘తారకరామం-అన్నగారి అంతరంగం’ పుస్తకం ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఆవిష్కారం కానుంది.