నేడు మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన వ్యక్తి ఎవరు అంటే స్వర్గీయ ఎన్టీఆర్ అని టక్కున చెపుతారు అందరూ. సినీ, రాజకీయ రంగాలలో తన ప్రత్యేకతను, ప్రతిభను, సత్తాను చాటుకొన్న ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన గురించి తెలుగు ప్రజలకి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే రెండు మూడు తరాల ప్రజలు ఆయన సినిమాలు చూసారు. ఇంకా తరువాత తరాలవారు కూడా చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉంటారు.
ఆయన సినిమాలు ఆయనకి అజరామరమయిన కీర్తి ప్రతిష్టలు అందిస్తే, రాజకీయ రంగంలో ఆయన కనబరిచిన విశిష్టత ఆ కీరితి ప్రతిష్టలకి కొత్త సొబగులు అద్దిందని చెప్పవచ్చును. ఆయన రాజకీయాలలో ఏవిధంగా పైకి ఎదిగారో, పాలనాపరంగా ఎన్ని సంస్కరణలు చేసారో అందరూ చూసారు. ఆ కారణంగానే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు కూడా ఆయన సుపరిచితుడే. ఒకప్పుడు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉందనే సంగతి చాలా మంది ఉత్తరాది ప్రజలకు తెలియదు అంటే అబద్దం కాదు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరినీ ‘మద్రాసీ’లుగానే భావించే ఉత్తరాదివారిని తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించేలా చేసిన వ్యక్తి ఎవరు అంటే స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. తెదేపాను స్థాపించిన తొమ్మిది నెలలోనే తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ఆ తరువాత ఆయన ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పధకం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమ్రోగిపోయింది. అప్పటి నుండే తెలుగు ప్రజలకు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాది రాష్ట్రాలలో గుర్తింపు ఏర్పడిందని చెప్పవచ్చును.
తెలుగు బాషపై ఎన్టీఆర్ కున్న అభిమానం, పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. ఆయన తెలుగు బాషకు ప్రతీక నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా నిలబదినప్పటికీ, రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఆయనను వేలెత్తి చూపే సాహసం ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే ఆయన స్వార్ధ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసమే జీవించిన మహానుభావుడు కనుకనే.
ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీలలో ఒకరయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధాంగి భువనేశ్వరి రెండుమూడు రోజుల క్రితమే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయవలసిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, భువనేశ్వరి, తదితరులు అందరూ ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొంటారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించిన తరువాత ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి ఈ సందర్భంగా ప్రతీ ఏటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం కూడా ఆనవాయితీగా పాటిస్తుంటారు. కనుక ఆ కార్యక్రమం కూడా నేడు ఉండవచ్చును. జూ.ఎన్టీఆర్ ని తెదేపా దూరం చేసుకొనప్పటికీ, ఆయన తన తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతీ ఏట ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల తనకు ఎటువంటి శత్రుత్వం లేదని చాటి చెపుతూ మాటీవీ ఛానల్లో నిర్వహిస్తున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమంలో తను గెలుచుకొన్న రూ.12,50,000లలో సగం ఎన్టీఆర్ ట్రస్టుకి మిగిలిన సగాన్ని బాబాయ్ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న బసవతారకం క్యాన్సర్ రీసర్చ్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చేరు.