తెలంగాణలో 28 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు భూదాన్ భూములను అక్రమంగా కొన్నారంటూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక వారంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భూదాన్ భూములు కాదని నిర్దారించుకున్న తర్వాతనే వారు కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన అన్ని పత్రాలు వారి దగ్గర ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లలో అసలు భూదాన్ భూములు ఎప్పుడూ లేవు.
కానీ హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరపు లాయర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయారు. దాంతో మొత్తం నాలుగు సర్వే నెంబర్లలోని స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ భూములన్నీ మహేశ్వరం మండలం నాగారం అనే గ్రామంలో ఉన్నాయి. రిటైరయ్యే నాటికి మంచి విల్లాలో.. విశాలమైన ఇల్లో కట్టుకోవచ్చని వారు అక్కడ స్థలాలు కొనుగోలు చేసుకున్నారు.
వారు అధికారులు కావడంతో.. ఆ స్థలం గురించి పూర్తిగా తెలుసుకునే కొనుగోలు చేసి ఉంటారు. కబ్జా చేస్తే నేరుగా వారి పేరు మీద కొనుగోలు చేసే సాహసం చేయరు. కానీ తమకు వ్యతిరేంగా కోర్టును మిస్ లీడ్ చేశారని వారు ఇప్పుడు ఫీలవుతున్నారు. అందుకే డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఏం జరుగుతుందో తెలంగాణ అధికార వర్గాలకు అర్థం కావడంలేదు. కొంత మంది సీనియర్ అధికారులను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు.