తెలుగుదేశం పార్టీ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది. తెలంగాణలో తెరాస అదే పనిలో చాలా కాలంగా బిజీగా ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం ఆపరేషన్ వికర్ష కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన పార్టీ నుంచి బలమైన నాయకులు, మేధావి కోవకు చెందిన పెద్దలు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు వెన్నంటి ఉన్న వారిలో చాలా మంది ఇప్పుడు దూరమయ్యారు. తాజాగా సీనియర్ నాయకుడు మైసూరా రెడ్డి కూడా జగన్ వైఖరిపై గుర్రుగా ఉన్నారని, త్వరలోనే వైసీపీని వీడతారని వార్తలు వస్తున్నాయి.
అందే విచిత్రమో గానీ వైసీపీ నుంచి బయటకు పోవడమే గానీ కొత్తగా లోనికి రావడం కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు వరసగా క్యూకట్టి మరీ సైకిల్ ఎక్కుతున్నారు. సరే, వాళ్లంటే స్వార్థంతో, అధికారం కోసం వెళ్తున్నారని ఆరోపించ వచ్చు. ఏ పదవీ లేని సీనియర్లు, గట్టి మద్దతుతారులు కూడా ఎందుకు బయటకు వెళ్లారనేదానిపై ఆయన ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారో లేదో. చివరకు, రెండేళ్ల క్రితం వరకూ కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే జగన్ ను నూటికి వెయ్య శాతం సమర్థించి, ఆయనపై ఈగవాలకుండా చూస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడిన సబ్బం హరి ఇప్పుడు ఎక్కడున్నారు? అంతటి గట్టి మద్దతుతారును కూడా జగన్ దూరం చేసుకున్నారు.
జగన్ లో అహంభావం ఎక్కువని, తనకు ఎవరూ సలహాలు ఇవ్వకూడదనే మనస్తత్వమని ఆ పార్టీనుంచి బయటకు వచ్చిన వారు చెప్తున్నారు. రాజకీయ పార్టీలో టీమ్ స్పిరిట్ తో పనిచేయాలి. వైసీపీలో అది కనిపించదనే విమర్శ చాలా కాలంగా ఉంది. టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించడం వెనుక అధికార పార్టీలో చేరి హవా చెలాయించాలనే ఒక ఉద్దేశం ఉండొచ్చు. అయితే, జగన్ వైఖరితో విసిగిపోవడం కూడా మరో కారణం అంటున్నారు. ముఖ్యంగా తన తండ్రి సమకాలికుడైన మైసూరా రెడ్డి పట్ల కూడా జగన్ వైఖరి సరిగా లేదని వార్తలు వస్తున్నాయి. ఆయన మాస్ లీడర్ కాకపోయినా తెరవెనుక రాజకీయ పరమైన, రాజ్యాంగ, ఇతరత్రా అంశాలపై మంచి సలహాలు ఇవ్వగల నాయకుడు. అలాంటి వ్యక్తికి తగిన గౌరవం దక్కలేదనే వార్తల్లో నిజమెంతో జగన్ కు, మైసూరా రెడ్డికే తెలియాలి. అయితే, తాను త్వరలోనే పార్టీని వీడిపోతానని మైసూరా కొందరు పాత్రికేయులతో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన టీడీపీలో చేరుతారా మరేం చేస్తారనేది ప్రస్తుతానికి తెలియదు.
వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం సభలో జగన్ చెప్పినప్పుడు అరవడానికి, స్పీకర్ పోడియం చుట్టుముట్టి గోల చేయడానికే పరిమితం అనే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం నిరంకుశ విధానానికి సూచిక. ప్రతి అంశంపైనా జగన్ ఒక్కరే మాట్లాడాలా? మరొకరికి అవకాశం ఎందుకు రాదు? పట్టుమని పదిమంది సభ్యులున్న పార్టీలు కూడా వీలైనంత ఎక్కువ మందికి మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని పార్లమెంటులో చూస్తుంటాం. మరి జగన్ ఆపరేషన్ వికర్షకు ఇన్ని కారణాలున్నప్పుడు పున: పరిశీలనకు అవకాశం ఉందో లేదో ఆయనే ఆలోచించుకోవాలి. మైసూరా రెడ్డి మనస్తాపంతో అయినా పరిస్థితిలో మార్పు వస్తుందో లేదో చూద్దాం.