ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సిద్ధమవుతున్న సమయంలో తొలగించబడే వారు, చేరేవారి గురించి చాలా వూహాగానాలు జరుగుతున్నాయి.లోకేశ్, అఖిల ప్రియ, కళావెంకట్రావు ఖచ్చితమని మరి కొందరు వుండొచ్చని అందరూ చెప్పుకుంటున్నారు. వైదొలగే పేర్లు కూడా మూడు నాలుగు పేర్లు సంచారం చేస్తున్నాయి. అయితే ఎవరూ వూహించలేని రీతిలో కొందరు సూపర్ సీనియర్ మంత్రులూ మాజీ సీనియర్లుగా వుండి ఇతర బాధ్యతలు చూస్తున్నవారు కూడా బయిటపడాలనుకుంటున్నారట. వారి పేర్లు భవిష్యత్ ఆశలు ఇప్పటికి సస్పెన్స్. లోకేశ్ కూడా మంత్రివర్గంలోకి రానుండడం ఇందుకో కారణం కావచ్చు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు తర్వాత మూడో తరం వారసుడి ఆదేశాలు ఆధిపత్యం కూడా అంగీకరించాల్సిన పరిస్థితి ఇందుకో కారణం కావచ్చు.మొన్న ఆయన ప్రమాణస్వీకారం సందర్భంలోనే ఇలాటి వారంతా వరుసగా వచ్చి నమస్కారంచేసి అభినందిస్తున్న దృశ్యం పరిస్థితికి అద్దం పట్టింది. ఒకసారి లోకేశ్ అంటూ వచ్చాక కాస్త అటూ ఇటుగా ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు గనక తమ సూపర్ సీనియార్టికి విలువ తగ్గుతుందన్న అంచనా కావచ్చు. తెలంగాణలో శక్తివంతుడుగానూ సీనియర్గానూ పేరు తెచ్చుకున్న హరిశ్ రావుకే తూకం తగ్గి కెటిఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే వయసు పైబడిన తమలాటి వారికి ఇక పాత పాత్ర వుండదని వీరంతా అర్థం చేసుకుంటున్నారు.అలా అని ఒక పరిమితికి మించి లోకేశ్ చుట్టూ తిరగలేరు కూడా. ఈ పరిస్థితుల్లో మెల్లగా తప్పుకోవడమే మేలనుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా వుంది గనక ఇతరత్రా పదవులు ఏవైనా తెచ్చుకోవాలనే ఆశవీరికి వుండొచ్చు.మొత్తంమీద ఇలాటి ఇద్దరు ముగ్గురు కూడా తమ మనోభావాలు చంద్రబాబుకు ఆయన సన్నిహితులకు చేరవేసినట్టే కనిపిస్తుంది.చంద్రబాబు తమను తొలగించే అవకాశం ఇవ్వకుండా తామే అలాటి విజ్ఞప్తి చేస్తే గౌరవంగా వుంటుందనీ అనుకోవచ్చు. ఏమైనా రానున్న కాలంలో తెలుగుదేశం సీనియర్ మంత్రులు పెద్దల స్థానాలు కొన్ని మార్పులకు గురైతే ఆశ్చర్యపోనవసరం లేదు.