రేవంత్ రెడ్డి కేబినెట్లో సీనియర్లు అందరికీ చాన్స్ లభిస్తోంది. రేవంత్ తో పాటు పదకొండు మంది మంత్రులయ్యారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణ రావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, , పొన్నం ప్రభాకర్ ,సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులయ్యారు. వీరు కాకుండా మరో ఎనిమిది ఖాళీలు ఉంటాయి.
సామాజికవర్గాల పరంగా అందరికీ ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. సహజంగానే రెడ్డి వర్గానికి ప్రాధాన్యం లభించింది. రేవంత్ తో పాటు నలుగురు రెడ్డి వర్గానికి చెందిన వారు ఉంటున్నారు. వారిని కాదనలేని పరిస్థితి. వెలమ వర్గం నుంచి జూపల్లికి చాన్సిచ్చారు. ఆయననూ కాదనలేరు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు కమ్మ కోటాలో అవకాశం లభించింది. బీసీ కోటాలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లకు అవకాశం లభించింది. దళిత కోటాల మల్లు భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ మంత్రులయ్యారు. వీరిలో భట్టికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారు.
ఇక సీతక్కకు కూడా చాన్స్ లభించింది. ఆమెకు డిప్యూటీ సీఎం ఇస్తారనుకున్నారు కానీ…భట్టి ఆ హోదా తనకు ఒక్కడికే ఉండాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. సీనియర్లు అందర్నీ సంతృప్తి పరిచే విధంగా మొదటి కేబినెట్ కూర్పు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్పీకర్ ఎవరో ఖరారు చేసుకున్న తరవాత మిగతా మంత్రి పదవుల్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. 64 సీట్లే రావడం… వల్ల కాంగ్రెస్ లో పోటీ దారులు తక్కువ ఉన్నారని అనుకోవచ్చు.