హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినపత్రిక ‘సాక్షి’ తెలుగుదేశం పార్టీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఇవాళ సంచలన కథనాన్ని ఇచ్చింది. లోకేష్ తన రాజకీయ ప్రాబల్యం పెంచుకునే ఎత్తుగడలో భాగంగా రాజ్యసభకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారని, జూన్ నెలలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుందని, ఆ స్థానంలో తాను వెళ్ళాలని లోకేష్ యోచిస్తున్నారని సాక్షి పేర్కొంది. జాతీయస్థాయిలో మీడియా మేనేజిమెంట్ కోసం ఇప్పటికే ఢిల్లీలో లోకేష్ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆ కథనంలో రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌తో తనను ఇటీవల పోల్చటం ఎక్కువైపోవటం, కేటీఆర్ ముందంజలో ఉండటంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్నట్లయితే రాష్ట్రంలోనూ తన పాపులారిటీ పెరుగుతుందని లోకేష్ భావిస్తున్నట్లు రాశారు. మరోవైపు సుజనా చౌదరి వ్యవహారశైలి పట్ల చంద్రబాబు గుర్రుగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. చౌదరి రాష్ట్ర పార్టీ నేతలు చెప్పిన పనులేవీ పట్టించుకోవటం లేదని కొందరు ఎంపీలు బాబుకు ఫిర్యాదు చేశారని, దానికి బదులిస్తూ ఎలాగూ చౌదరికి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూ చేయటంలేదని అన్నట్లు రాశారు.
బద్ధ శత్రువైన తెలుగుదేశంపై, ఆ పార్టీ నాయకులపై వ్యతిరేక కథనాలు ఇవ్వటం సాక్షికి పరిపాటి అన్న విషయం తెలిసిందే. మరి ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. వాస్తవానికి లోకేష్‌కు, సుజనా చౌదరికి మధ్య మంచి అవగాహన ఉందని చెబుతారు. ఈ కథనం మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. అయితే లోకేష్‌ను కేటీఆర్‌తో పోల్చటం ఇటీవలికాలంలో ఎక్కువవటం, కేటీఆర్ ముందంజలో ఉండటం మాత్రం నిజమే. ఒకవేళ ఈ కథనం నిజమయితే, లోకేష్ రాజ్యసభకు వెళ్ళాలనుకోవటం మాత్రం రాజకీయంగా సమయోచిత నిర్ణయంగా కాదనే చెప్పాలి.