హైదరాబాద్: సారిక తన న్యాయవాది రెహానాకు పంపిన మెయిల్స్ బయటకొచ్చాయి. అత్తింటి వేధింపులను తన మెయిల్లో వివరించారు. తన భర్త అనిల్‌కు ఒక ముస్లిమ్ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆ మెయిల్లో పేర్కొన్నారు. అనిల్, తనను, పిల్లలను నిర్లక్ష్యం చేశాడని, ప్రశ్నిస్తే అత్తమామల ముందే తనను హింసించేవాడని రాశారు. ఇంట్లో సరుకులు కూడా తెచ్చేవాడు కాదని తెలిపారు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు పెరిగాయని, ఆయన తనను జీవితం త్యాగం చేయాలని చెప్పాడని పేర్కొన్నారు. తనను బయటకు గెంటాలని ప్రయత్నించారని, వంటగది తాళం పెట్టుకునేవారని రాశారు. పిల్లలకు పాలడబ్బాలుకూడా కొనేవారుకాదని, మంగళసూత్రం తాకట్టు పెట్టి వారి కడుపు నింపారని పేర్కొన్నారు. అత్త మాధవి తిట్లు, అరుపులతో నిత్యం వేధించేవారని రాశారు. మరోవైపు న్యాయవాది రెహానా ఇవాళ ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ, సారికది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని, తప్పనిసరిగా అది హత్యేనని అన్నారు. సారిక తన కథనంతా చెప్పిందని, అది హృదయవిదారకంగా ఉందని చెప్పారు. అత్తమామలు, భర్త తీవ్రంగా వేధించినట్లు సారిక చెప్పిందని తెలిపారు. ఆమెను వారు పనిమనిషికన్నా హీనంగా చూశారని రెహానా అన్నారు. వారి ఇంటినుంచి బయటకొచ్చేయమని తాను సూచించానని, అయితే బయటకొస్తే తన పిల్లలకు ఆస్తి దక్కదనే ఉద్దేశ్యంతో సారిక అక్కడే ఉందని చెప్పారు. ఆ ప్రకారంగానే వరంగల్‌లోని ఇంటిని సారికకు రాజయ్య ఇచ్చేశాడని, అయితే మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వకపోవటంతో సారిక అనేక కష్టాలు పడిందని తెలిపారు.
సారిక, అనిల్ ఇంజనీరింగ్ ఒకే కాలేజిలో చదివారు. అప్పుడే ప్రేమించుకున్నారు. అనిల్ దళితులు కాగా, సారిక విశ్వబ్రాహ్మణ(బీసీ) సామాజికవర్గానికి చెందినవారు. ఇంజనీరింగ్ పూర్తికాగానే సారికకు విదేశాలలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్ళారు. అనిల్‌ను సారికే పోషించేది. తర్వాత సారికకు బెంగళూరులో ఐబీఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. రాజయ్య ఎంపీ అయిన తర్వాత సారికతో అనిల్ రాజీనామా చేయించాడు. భర్త నిరాదరణకు గురైన తర్వాత ఉద్యోగం చేయాలని ఉన్నా పిల్లలు ముగ్గరూ చిన్నవారవటంతో చేయలేకపోయింది.