పార్టీ నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి పదవులకు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను ప్రధానమంత్రికి అందించామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… మంత్రులుగా దేశానికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. ఈ సందర్భంగా ఏపీకి తనవంతు సహాయం చేస్తానని ప్రధాని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలేంటో ప్రధానమంత్రికి తెలుసునని సుజనా చౌదరి అన్నారు. రాజీనామాలతో తమకు మరింత స్వేచ్ఛ వస్తుందని చౌదరి చెప్పారు. ఎన్డీయేలో కొనసాగుతూనే హక్కుల సాధనకు తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంటుందన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయడానికి ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో రెండు జాతీయ పార్టీలూ ద్రోహం చేశాయని సుజనా ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించాల్సిన అవసరం ఉందనీ, ప్రజల ఆకాంక్షల మేరకే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చింది స్పష్టం చేశారు. కేంద్రం గతంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని సక్రమంగా అమలు చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఏదేమైనా, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ పోరాటం చేస్తామనీ, తదుపరి కార్యాచరణ ఏంటనేది పార్టీ అధినేతతో చర్చించాక వెల్లడిస్తామని సుజనా చెప్పారు. సో.. మరో లాంఛనం పూర్తయినట్టు లెక్క.
సెంటిమెంట్లతో రాజకీయాలు చేస్తే కేటాయింపుల్లో మార్పులేవీ రావని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సెంటిమెంటు ఎంత బలంగా ఉందనేది ఇప్పటికైనా కేంద్రం అర్థం చేసుకుంటే మంచిది. ఏపీ ప్రజల సెంటిమెంట్ తీవ్రత స్థాయి ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా వరకూ పరిస్థితిని తీసుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నది టీడీపీ మాత్రమే కావొచ్చు. కానీ, క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేసే వరకూ పరిస్థితి వచ్చిందంటే అది ప్రధానమంత్రి వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపినట్టే లెక్క. ఈ రాజీనామాలను టీడీపీ రాజకీయ చర్యగా చూస్తారా, లేదా దీన్లో తమ బాధ్యతారాహిత్యం కూడా కొంత ఉందని ప్రధాని గ్రహిస్తారా అనేది వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అన్నిటికీ మించి, సెంటిమెంట్ ఎంత బలంగా ఉందనేది ఈ రాజీనామాల ద్వారా కేంద్రం కాస్తైనా అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.