అవును.. కేసీఆర్ నమ్ముకున్న సెంటిమెంటే ఆయనను వెక్కిరిస్తోంది. ప్రత్యర్ధి వ్యూహమో, యాదృచ్చికమో కానీ బలంగా విశ్వసించే ఆ సెంటిమెంటే కేసీఆర్ ను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆరు.. ఆరు.. అని కలవరించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే ఆరు శనిలా దాపురించింది.
కేసీఆర్ సెంటిమెంట్ నెంబర్ ఆరు..ఆయన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏం చేయాలనుకున్నా ఆరు నెంబర్ వచ్చేలా చూసుకునే వారనేది ఓపెన్ సీక్రెట్. కానీ, అదే ఆరు ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ బలహీనపడేందుకు కారణం అవుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు.. కేసీఆర్ ను అమితంగా విశ్వసించే నెంబర్ “ఆరు” కావడం గమనార్హం.
ఈ ఆరు నెంబర్ తోనే కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నట్టు ఉన్నారేమో, అదే నెంబర్ తో కేసీఆర్ ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే, తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరుకున్నారు. ఇదంతా ఆరు నెంబర్ దగ్గరే ప్రస్తుతం ఆగిపోవడం మరో విశేషం. దీంతో కేసీఆర్ అదృష్టంగా భావించిన ఆరు నెంబరే ఆయనను ప్రస్తుతం వెక్కిరిస్తోందన్న సెటైర్లు పేలుతున్నాయి.