విశాఖను రాజధాని చేయకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తరచూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వైసీపీ హైకమాండ్ ఉందన్న వాదన బలపడుతోంది. ఇలా ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నా.. వైసీపీ హైకమాండ్ ఆయనను నియంత్రించడం లేదు కదా.. మరింత ప్రోత్సహిస్తున్నట్లుగా పరిస్థితి మారింది. దీనిపై రాజకీయ పార్టీలు వైసీపీ తీరును ప్రశ్నిస్తున్నాయి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకని.. దమ్ముంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ధర్మాన ప్రసాదరావు చేస్తున్న డిమాండ్ వైసీపీ పార్టీ పరంగా చేయకపోతే.. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వినిపించారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య రాజకీయం కోసం చిచ్చు పెడుతున్నారని ఆయన మండి పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా… ధర్మన తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, భూకబ్జాల నుంచి దారి మళ్లించడానికి ఈ వాదన వినిపిస్తున్నారని.. ఆయనకు వైసీపీ హైకమాండ్ సపోర్ట్ ఉందని అంటున్నారు.
కారణం ఏదైనా… రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. అయితే ఇతర పార్టీలలో ఎవరూ ఈ వాదనను బలపర్చడం లేదు. విచిత్రంగా వైసీపీలోని ఇతర నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం లేదు. ఒక్క ధర్మాన మాత్రమే ఈ వాదన వినిపిస్తున్నారు. తమ ప్రమేయం లేకపోతే.. వైసీపీ హైకమాండ్ ఇప్పటికే మందలించి ఉండేది. అలా చేయకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.