సెప్టెంబర్ 17 అంటే రాబోయే మంగళవారం హైదరాబాద్ పోలీసులకు పరీక్షగా మారనుంది. సెప్టెంబర్ 17న రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచనం అని, విద్రోహం అని, విలీనం అని రకరకాల పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే… ఈసారి ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవం జరుపుతోంది.
హైదరాబాద్ సహ జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అదే రోజు బీజేపీ నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17కు సంబంధించిన కార్యక్రమం ఉంది. ఇక పాత బస్తీలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు కూడా జరపబోతున్నారు.
మరోవైపు ఈసారి సెప్టెంబర్ 17నే హైదరాబాద్ లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంది. దాదాపు 25వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలో 15వేల మంది పోలీసులు, జిల్లాల నుండి మరో 10వేల మంది పోలీసులను కేటాయించారు. మధ్యాహ్నం 1.30గంటల లోపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఇక హుస్సేన్ సాగర్ వైపు వచ్చే మూడు కమిషనరేట్ల విగ్రహాలను వీలైనంత త్వరగా గంగమ్మ ఒడికి చేరేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఒకేరోజు చాలా కార్యక్రమాలు… పైగా అన్నీ హైదరాబాద్ లోనే ఉన్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు పరీక్షగా తయారైంది. ముఖ్యంగా సిటీ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఏమాత్రం వైఫల్యం ఉన్నా మొత్తం డిపార్ట్మెంట్ కు, సీఎం వద్దే హోంశాఖ కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకు చెడ్డ పేరు వస్తుందని… ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని పోలీస్ శాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.