సెప్టెంబర్ 17 అంటే.. తెలంగాణ రాజకీయాలకు ఓ ఊపు వస్తుంది. దాదాపుగా నెల రోజుల ముందు నుంచే మాటల మంటలు ప్రారంభమవుతాయి. ఆ రోజున వారి వారి పార్టీల విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడక ముందు బీఆర్ఎస్.. ఏర్పడిన తరవాత బీజేపీ .. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ప్రయత్నించేవారు. వారిని అడ్డుకునే పోలీసులతో మంచి పొలిటికల్ సీన్లు కనిపించేవి. అయితే ఈ సారి మాత్రం అలాంటివేమీ కనిపించడం లేదు.
సెప్టెంబర్ పదిహేడో తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం, విముక్తి దినోత్సవం.. లేకపోతే విద్రోహదినం. ఇలా ఎవరికి వారు అనుకుంటారు. ఎందుకంటే ఆరోజున భారత యూనియన్ లో తెలంగాణను విలీనం చేశారు. భారత్ కు అంతకంటే ముందే స్వాతంత్ర్యం వచ్చింది. ఇలా చేయడానికి నిజాంపై సైనిక చర్యకు దిగాల్సి వచ్చింది. ఇదంతా చరిత్ర. ఈ చరిత్రను తమ రాజకీయాలకు వాడుకోవడానికి.. పార్టీలన్నీ ఎవరి విధానాలకు తగ్గట్లుగా వారు ప్రయత్నిస్తూ ఉంటారు.
గత ఏడాది బీజేపీ .. కేంద్రం ద్వారా అధికారికంగా గుర్తించి వేడుకలు చేసింది. అయితే పెద్దగా ప్రయోజనం కలగలేదు. బీఆర్ఎస్ ఉద్యమం సమయంలో అధికారికంగా నిర్వహించాలని .. తర్వాత అవసరం లేదని విధానాలు మార్చుకుంది. ఈ ఏడాది అసలు ఏ పార్టీకి పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే .. ఖచ్చితంగా నిమజ్జనం కూడా ఇదే రోజు జరుగుతూండటంతో .. పాత రాజకీయాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రజా పాలన రోజు అని మార్చుకున్నా.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా అధికారిక కార్యక్రమం నిర్వహించినా… పెద్దగా ఎవరికీ పట్టలేదు.