ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది. తెలంగాణలోనూ వస్తుంది. ప్రతీ ఏడాది విమోచనా దినోత్సవం అధికారంగా చేయాలని ఒకరు… చేయకపోతే ఏమవుతుందని మరొకరు.. చేయకపోతే చేస్తామంటూ మరొకరుల హడావుడి చేస్తూంటారు. కానీ అన్ని పార్టీలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం సీన్ మారిపోయింది. అన్ని పార్టీలు పోటాపోటీగా చేస్తున్నాయి. అధికార పార్టీలు నేరుగా అధికారికంగా చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ.. తమ పార్టీ అధికారికం అన్నట్లుగా నిర్వహిస్తోంది. ఎవరికి వారు భారీగా ప్రచారం చేసుకుంటున్నారు.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మొదట కేంద్రం నిర్ణయించింది. అప్పటి వరకూ వివిధ కారణాలతో వద్దనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. వెంటనే ఘనంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకుంది. కేంద్రం తరపున నిర్వహించనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. రాష్ట్రం తరపున నిర్వహించబోయే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనడం సహజమే. అయితే ఈ విమోచనా దినంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎక్కువ ప్రచారం తమకే వచ్చేలా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ చేతిలో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారం లేకపోయినా వెనక్కి తగ్గడం లేదు. సొంతంగా వేడుకలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ , బీజేపీలు గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నాయి. కానీ ఎప్పుడూ తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలని అనుకోలేదు. టీఆర్ఎస్ గతంలో డిమాండ్ చేసినా సైలెంట్‌గా ఉంది. బీజేపీ నిర్వహించాలని డిమాండ్ చేసింది కానీ.. కేంద్రం తరపున నిర్వహించాలనే ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. రెండు పార్టీలు పోటాపోటీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎవరి ఉత్సవాల్లో నిజాయితీ ఉందని ప్రజలు నమ్మితే వారికే సానుకూలత ప్రదర్శించే అవకాశం ఉంది.