ఒకేసారి 5 సినిమాలొస్తున్నాయంటే – దసరా సీజన్ ముందే వచ్చేసిందన్నంత ఉత్సాహం వచ్చింది. తీరా ఆ ఐదూ తుస్సుమనేశాయి. వారానికి నాలుగైదు సినిమాలొచ్చినప్పుడు కనీసం ఒక్క సినిమా అయినా నిలదొక్కుకొనేది. ఓకే అనిపించుకొనేది. ఈసారి ఆ అవకాశమూ దక్కలేదు తెలుగు ప్రేక్షకులకు. ఉంగరాల రాంబాబు, శ్రీవల్లీ, కథలో రాజకుమారి, సరసుడు, వీడెవడు… ఇవన్నీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. కనీసం ఉంగరాల రాంబాబుకైనా ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు. కానీ సునీల్ ఆ అంచనాల్నీ అందుకోలేకపోయాడు. నారా రోహిత్, నాగశౌర్య.. ఇద్దరికీ మల్టీప్లెక్స్‌లో మంచి ఆదరణే లభించేది. ఇద్దరూ కలసి చేసిన సినిమా, పైగా హిట్ కాంబినేషన్, టైటిల్ కూడా పొయెటిక్‌గా ఉంది.. అయినా సరే, మల్టీప్లెక్స్‌లో టికెట్లు తెగలేదు. హైదరాబాద్‌లో అయితే పేరున్న మల్టీప్లెక్స్‌లన్నీ ఖాళీగా కనిపించాయి. కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో నిర్మాతల్ని బాగా నిరాశ పర్చింది. ఇక శ్రీవల్లీ, సరసుడు, వీడెవడు సినిమాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా ఐదుకి ఐదూ… నిరాశ పరిచాయి. అప్పుడెప్పుడో విడుదలైన ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలే మళ్లీ దిక్కయ్యాయి. ఈవారం ‘జై లవకుశ’ వస్తోందిగా. ఆ వెంటనే ‘స్పైడర్’ రంగంలోకి దిగుతాడు. ‘మహాను భావుడు’ కూడా క్యూ కట్టబోతున్నాడు. కాస్త ఓపిక పడితే – బాక్సాఫీసు దగ్గర మళ్లీ కళకళలు చూడొచ్చు.