ఈమధ్య పార్ట్ 2 హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కథకు కొనసాగింపు ఉందన్న విషయం క్లైమాక్స్ లో చూపించి, పార్ట్ 2కి బాటలు వేసుకొంటున్నారు. సినిమా హిట్టయితే పార్ట్ 2 బీజం ఉపయోగపడుతుంది. లేదంటే… సీక్వెల్ తీయమని అడిగేవాళ్లు ఉండరు. అది వేరే విషయం. నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించాడు. ఈ కథకు సీక్వెల్ ఛాన్సుందట. ఆ విషయం నానినే చెప్పాడు. ‘సరిపోదా శనివారం’ ఓ ఇంట్రస్టింగ్ నోట్ తో ముగుస్తుందని, అవసరం అనుకొంటే సీక్వెల్ చేయొచ్చని, ఈ సినిమా హిట్టయితే తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు నాని. అంటే క్లైమాక్స్‌లో పార్ట్ 2కి ఏదో బలమైన లీడ్ వేశారన్నమాట. అదేంటో సినిమా చూస్తే కానీ అర్థం కాదు.
మరోవైపు ‘సరిపోదా…’ అడ్వాన్సు బుకింగులతో బాక్సాఫీసుకు కొత్త జోష్ వచ్చింది. ‘కల్కి’ తరవాత ఆ స్థాయిలో అడ్వాన్సు బుకింగులు జరిగింది ఈ సినిమాకే. ఇటీవల పెద్ద సినిమాల హడావుడి లేక బాక్సాఫీసు బోసుపోయింది. నాని సినిమాతో థియేటర్ల దగ్గర మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రీమియర్లు లేవన్న మాటే కానీ, గురువారం ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలైపోతున్నాయి. నాని కూడా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత అంతా తన భుజాన వేసుకొన్నాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ అనారోగ్యం పాలవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ కరక్షన్లు చూసుకొని, ఫైనల్ కాపీ సిద్ధం చేసే బాధ్యత నానిపైనే పడింది.