శంకర్ సినిమా ‘బోయ్స్’ తో చాలామంది వెలుగులోకి వచ్చారు. అందులో సిద్దార్థ్ కూడా ఉన్నాడు. తమన్ ని తొలిసారి నటుడిగా చూపించిన సినిమా అది. ఇప్పుడు ఈ టీమ్ సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. బాయ్స్ అనేది కుర్ర గ్యాంగ్ కథ. వాళ్ల అల్లర్లు, చిలిపి పనులు, సరదాలూ.. ఇవన్నీ బాయ్స్‌లో కనిపించాయి. ఆ బాయ్స్‌కి పెళ్లయితే ఎలా ఉంటుందన్నది ‘బాయ్స్ 2’. పెళ్లయినవాళ్లని ‘బాయ్స్’ అనకూడదు కాబట్టి టైటిల్ ఏమైనా మారుస్తారేమో చూడాలి. కాకపోతే ఈ టీమ్ మొత్తం కలసి పనిచేయడం ఖాయం అయ్యింది. సిద్దార్థ్, తమన్లతో పాటు తెరపై కనిపించిన నటీనటులు మరోసారి కలసి పనిచేస్తారు. అయితే దర్శకత్వ బాధ్యత శంకర్ తీసుకుంటాడా? లేదంటే శంకర్ శిష్యులలో ఎవరికైనా అప్పగిస్తారా? అనేదే తెలియాల్సివుంది. శంకర్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యేసరికి ఏడాది పట్టొచ్చు. అంత వరకూ ఆగేది లేదనుకుంటే, మరో దర్శకుడితో ‘బోయ్స్ 2’ పట్టాలెక్కుతుంది. శంకరే కావాలి అనుకుంటే మరో యేడాది ఆగాలి. అదేంటో శంకర్‌కి ఈమధ్య సీక్వెల్‌పై ధ్యాస పెరిగింది. రోబో, భారతీయుడు.. ఇప్పుడు బోయ్స్. భవిష్యత్తులో మరెన్ని వస్తాయో..??