నిన్నటి సూపర్ హిట్ సినీ స్వప్నాన్ని మళ్ళీ మళ్ళీ వీక్షించాలని ఇష్టపడే ప్రేక్షకులకి ఎంతో అనిపించొచ్చు. అలాగనీ…చూసిందే చూడడం కూడా మొనాటనీ కావొచ్చు. వీక్షకుల ఈ ఆశ, ఆకాంక్షని వర్తమాన పరిస్థులకనుగుణంగా కాస్త ఆధునీకరించి ఆవిష్కరించే మహత్తర రూపమే సీక్వెల్. భారతీయ వినోద ప్రపంచం గర్వించదగ్గ బాలీవుడ్ లో ఈ సీక్వెల్ హవా ఎప్పటినుంచో రాజ్యమేలుతోంది. ప్రస్తుతం ఇది దక్షిణాది భాషల్లోనూ విస్తరించి వీక్షకులను అలరిస్తోంది. కొన్నాళ్ళు సీక్వెల్ సందడి తగ్గినట్లనిపించినా…మళ్ళీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావుడి హుషారెత్తిస్తోంది. ఓ కొత్త సినిమా ప్రారంభించాలంటే ఇతివృత్తం సమస్య మొదట తలెత్తుతుంది. కానీ…సీక్వెల్ కి ఆ బెడద లేదు. రెడీమేడ్ సబ్జెక్టు కి ఈ కాలానికి తగ్గట్లు కాస్త మెరుగులద్దడమే. అందుకే…హీరోల డేట్స్ ఇచ్చిన వెంటనే సీక్వెల్ ని స్పీడ్ గా పట్టాలకు ఎక్కించొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమాలో మొదలైన సీక్వెల్స్ గురించి ఓ లుక్కేద్దాం.
మహేష్ ఒక్కడు-2
లేటెస్ట్ గా మహేష్ బాబు ఒకనాటి ట్రెండ్ సెట్టర్ ఒక్కడు కి డైరెక్టర్ గుణశేఖర్ సీక్వెల్ ని రూపొందిద్దామనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఒకప్పుడు ఒక్కడు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. మహేష్ యాక్షన్, ప్రకాష్ రాజ్ విలక్షణ విలనిజం, ఆకట్టుకుని కనికట్టు చేసే నాయిక భూమిక అందం, పాటలకు వినసొంపైన బాణీలు కట్టిన మణిశర్మ స్వరాభిషేకం, సీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కర్నూల్ నేపథ్యం, కొండారెడ్డి బురుజు…వొళ్ళు గగుర్పొడిచే పోరాటాలు…ఇలా ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచే దృశ్యకావ్యం ఒక్కడు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఒక్కడు 2 పేరుతో ,గుణశేఖర్ మళ్ళీ నేత్రపర్వాన్ని అందించనున్నారు.
అనిల్ రావిపూడి ఎఫ్ -3
అనిల్ రావిపూడి డైరెక్టర్ గా తన మార్క్ వేసుకున్నారు. సరికొత్త కధాకథనాలతో వినోదాత్మక చిత్రాల రూప కల్పనలో ఆయన అందెవేసిన చెయ్యి. ఎఫ్-2 సినిమాతో ఆయన ప్రతిభని ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ గుర్తించారు. ఆయన సినిమా కోసం కళ్లింతలు చేసుకుని చూసేవాళ్లు సంఖ్య కూడా బాగా పెరిగింది. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ, మెహరీన్ లు నటించిన ఎఫ్-2 సినిమా కి తాజాగా ఎఫ్-3 రూపొందించాలని అనిల్ రావిపూడి ప్రయత్నాలు ప్రారంభించారు.
శ్రీను వైట్ల ఢీ అంటే ఢీ
కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్ల. కదిలి కదిలి కడుపారా నవ్వుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరి. రొటీన్ బాధలు మరిచి పోయి రెండున్నర గంటల వినోదాన్ని గుండెలనిండా పోదుముకోవచ్చు. అప్పుడెప్పుడో 13 ఏళ్ళ కిందట శ్రీను వైట్ల, మంచువారి హీరో విష్ణు కాంబోలో వచ్చిన సినిమా ఢీ. అప్పట్లో ఆ సినిమా వినోదంలో పైసా వసూల్ అనిపించింది. విష్ణు కొంటె నటన, అల్లరి పిల్ల జెనీలియా ఆటలు, పాటలు, ఆద్యంతం హాస్యవల్లరిగా రూపు దిద్దుకుంది ఈ సినిమా. ప్రస్తుతం సుదీర్ఘ విరామం అనుభవిస్తున్న శ్రీను వైట్ల మళ్ళీ మంచి వినోదంతో వీక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆ ఆలోచనలో భాగంగానే ఆయన ఢీ సినిమా సీక్వెల్ గా ఢీ అంటే ఢీ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఢీ లో నటించిన మంచు విష్ణు ఈ సినిమాలో కూడా హీరో. ఇతర తరగణాన్ని త్వరలో ఆయన ప్రకటించనున్నారు. ఢీ అంటే ఢీ సినిమాకి ఉప శీర్షిక గా డబుల్ డోస్ అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.
నిఖిల్ కార్తీకేయ సీక్వెల్
కార్తీకేయ మూవీ యువ హీరో నిఖిల్ కి ఎంతో పేరు తెచ్చింది. ఆద్యంతం ఉత్కంఠ గొలిపే సన్నివేశాలతో కార్తీకేయ ప్రేక్షకులకు బాగా నచ్చి విజయవంతమైంది. లేటెస్ట్ గా ఈ యువ హీరో చిత్రం కార్తికేయ కి సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు బోగట్టా. చందు మొండేటి దర్శకత్వం చేసిన కార్తికేయ లో నిఖిల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషించాడు. సీక్వెల్ లో పూర్తి స్థాయి డాక్టర్ గా నటించనున్నట్లు ప్రాధమిక సమాచారం.
సీక్వెల్ బాటలో హిట్
నిర్మాతగా నాని హిట్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. నాని తో పాటు హీరో విశ్వక్సేన్ కి, డైరెక్టర్ శైలేష్ కొలను కి ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. హిట్ మూవీ ముగింపులో సీక్వెల్ రాబోతున్నట్లు కూడా సంకేతం అందించారు. ఇంకోపక్క ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కూడా కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందన్న సమాచారం.
కేజీఎఫ్ కి సీక్వెల్
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ తీయబోతున్నారు. కేజీఎఫ్ 2 గా రాబోతున్న ఈ సినిమా కూడా వీక్షకులను అలరించబోతోంది..
దృశ్యం సీక్వెల్
వెంకటేష్ , మీనా నటించిన దృశ్యం సినిమా వర్తమాన పరిస్థితుల్లో, ఆధునిక సాంకేతికత అరచేతుల్లో ఇమిడిపోయింది నేపథ్యంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అవమానాలు, మృగాళ్ల వేధింపులు ఇన్నీ అన్నీ కావు. ఈ నేపథ్యంలో సందేశాత్మకంగా రూపొంది ప్రేక్షకులను ఆలోచింపచేసిన దృశ్యం సినిమా కి సీక్వెల్ రాబోతోంది.
మమ్ముటి సిబిఐ, మోహన్ లాల్ యోధ సినిమాల కి కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఇదే సమయంలో తమిళ్,హిందీ భాషల్లో సీక్వెల్స్ ముచ్చట్లు షికారు చేస్తూనే ఉన్నాయి.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో అప్పట్లో సూపర్ సక్సెస్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ రాబోతూవున్నట్లు అడపాదడపా వార్తలు చక్కర్లు కొట్టడమే కానీ…కార్య రూపం దాల్చలేదు.