టెన్నిస్ ప్రపంచంలో అందానికి అందం, ఆటలో అద్భుత ప్రతిభగల క్రీడాకారిణుల్లో మరియా షరపోవా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆమెకు సాటి ఎవరూ లేరంటారు అభిమానులు. ఇటీవల డోపింగ్ లో పట్టుబడి సస్పెండ్ అయిన షరపోవా, ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఇంత కాలం సంపాదనలో మకుటం లేని మహారాణిలా వెలిగిపోయింది. మహిళా టెన్నిస్ ప్లేయర్స్ లో అత్యధిక ఆదాయం గల వ్యక్తిగా రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డు కూడా చేజారిపోయింది. మరియాను ఎన్నో మ్యాచ్ లలో ఓడించిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈ విషయంలో కూడా ఓడించింది.
రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా ఆదాయం చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయని అనే వారు. కానీ డోపింగ్ తర్వాత సీన్ మారిపోయింది. సెరెనో దూసుకొచ్చింది. గత 12నెలల్లో సెరెనా 28.9 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. మరియా షరపోవా 21.9 మిలియన్ డాలర్లతో వెనకబడి పోయింది. సస్పెన్షన్ వేటుతో ఇలా సీన్ రివర్స్ అయింది. అత్యధికంగా నగదు బహుమతి సంపాదించే క్రీడాకారిణిగా 11 ఏళ్లుగా ఉన్న రికార్డును కోల్పోయింది.
పదిహేడేళ్ల వయసులోనే వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్ షిప్ సాధించి సంచలనం సృష్టించిన మరియా షరపోవా, కష్టపడి ఎదిగింది. తన కోసం కుటుంబం చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంది. అందుకే, కసిగా ప్రాక్టిస్ చేసి టాప్ ప్లేయర్ గా మారింది. తన కుటుంబానికి డబ్బుకు ఇబ్బంది లేకుండా చేసింది.
ఈ అందాల టెన్నిస్ తార 2006లోనే యూఎస్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. 2008లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అయింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మాత్రం అంత సులభంగా దక్కలేదు. అందుకసం 2012 వరకూ ఆగాల్సి వచ్చింది. ఇదే టైటిల్ ను రెండో సారి 2014లోనూ గెల్చుకుంది.
సైనికంగా ఒకప్పుడు అమెరికా, రష్యా (అంతకు ముందు సోవియట్ యూనియన్) మధ్యే పోటీ ఉండేది. ఇప్పుడు మహిళల టెన్నిస్ లో మాత్రం అమెరికన్ సెరెనా, రష్యన్ మరియా షరపోవాల మ్యాచ్ అంటే రసవత్తరంగా జరుగుతుందని పేరు. అయితే షరపోవాపై సెరెనా 15 మ్యాచ్ లలో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా మ్యాచ్ లు మరీ ఏకపక్షంగా జరుగుతున్నాయి. సస్పెన్షన్ నుంచి బయటపడటానికి మరియా షరపోవా చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో తెలియదు. ఫలించిన తర్వాత మళ్లీ తన పాత ఫామ్ ను, అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచే క్రీడాకారిణి అనే రికార్డును సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.