అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. పవర్ ఫుల్ గేమ్ తో మరో టైటిల్ ను కైవసం చేసుకుంది. స్పెయిన్ ప్రత్యర్థి ముగురుజాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 6-4, 6-4 స్కోరుతో వరుస సెట్లలో అవలీలగా నెగ్గింది. విజయానికి మారుపేరుగా మారిన సెరెనా ఈ టోర్నీలో తన అక్కను చిత్తు చేసింది. సెమీస్ లో రష్యా భామ మరియా షరపోవాపై విజయం సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచీ సెరెనా డామినేషన్ కొనసాగింది. ప్రత్యర్థి హోరాహోరీగా పోరాడినా సెరెనా స్టామినా ముందు నిలవులేక చేతులెత్తేసింది. పవర్ ఫుల్ ఏస్ లు, షాట్లతో సెరెనా చెలరేగి ఆడింది. తొలిసెట్ ను 6-4తో సొంతం చేసుకుంది. రెండో సెట్లో నూ దూకుడు కొనసాగించింది. ప్రత్యర్థి కూడా తొలి టైటిల్ గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం లేకపోయింది. రెండో సెట్ ను కూడా సెరెనాకు సమర్పించుకుంది.
ఈ విజయంతో సెరెనా 21 గ్రాండ్ స్లాం టైటిల్స్ గెల్చుకుంది. ఒక్క వింబుల్డన్ లోనే ఇది ఆరో టైటిల్. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత అరుదైన విజయాలతో దూసుకుపో్తున్న సెరెనా విలియమ్స్ ను ప్రస్తుతం అడ్డుకునే వారే లేరేమో అనే రేంజిలో ఫామ్ లో ఉంది. ఎన్ని టైటిల్స్ గెల్చినా ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ, దూకుడును కొనసాగిస్తూ, బద్దకాన్ని దరిచేరకుండా జాగ్రత్త పడుతూ సెరెనా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క గెలుపుతో విర్రవీగే ఎంతో మందికి సెరెనా విజయయాత్ర చాలా స్ఫూర్తిదాయకం.