మార్చి 10వ తేదీ నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందే తెలంగాణా అసెంబ్లీ రూల్స్ కమిటీ చాలా కటినమయిన నిర్ణయం ఒకటి తీసుకొంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల మొదటిరోజున గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఎవరయినా అడ్డుకొనే ప్రయత్నం చేసినట్లయితే ఆ ఎమ్మెల్యేలని సభ నుండి ఏడాది కాలం పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విన్నప్పుడు, రెండేళ్ళ క్రితం తెరాస నేతలు అదే గవర్నర్ నరసింహన్ తో అదే సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఎంత అనుచితంగా ప్రవర్తించారో అందరికీ తప్పక గుర్తుకు వస్తుంది. తెరాస నేతలు అయన సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన చేతిలో నుండి ప్రసంగ పాఠం ఉన్న కాగితాలను బలవంతంగా గుంజుకొని ముక్కలు ముక్కలుగా చింపి ఎగురవేశారు. ఇప్పుడు అదే తెరాస నేతలు ఆయనని గౌరవించాలనుకొంటున్నారు.
అసెంబ్లీలో తెదేపా సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇంతవరకు తెదేపా శాసనసభ పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు తెరాసలో చేరిపోయారు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి సభలో రెచ్చిపోయినట్లయితే ఆయనకు ఎర్రబెల్లితోనే సమాధానం ఇప్పించవచ్చును. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను స్థంభింపజేసే ప్రయత్నాలు చేసినట్లయితే తెరాస ప్రభుత్వం వారిని నిర్దాక్షిణ్యంగా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపడానికి వెనుకాడకపోవచ్చును. కనుక ప్రతిపక్షాలు సభ నుండి సస్పెండ్ కాకుండా జాగ్రత్తపడుతూనే ఈసారి సమావేశాలలో అధికార పార్టీపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకొంటాయో చూడాలి.