తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ పెద్దల సర్వీసులో మునిగి తేలి తాము కూడా కొంత వెనకేసుకున్న అధికారులంతా ఇప్పుడు బిక్క చచ్చిపోతున్నారు. ఒక్కొక్కరి అరాచకాలు.. ఆస్తుల డాక్యుమెంట్లతో సహా బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఏసీబీ ఇటీవల శివబాలకృష్ణ అనే హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ ను పట్టుకుంది. ఆయనను ప్రశ్నించే కొద్దీ… తీగ లాగుతున్నట్లవుతుంది. ఒక్కొక్క అధికారి పేరు బయటకు వస్తోంది. ఫార్ములా E పేరుతో డబ్బులు దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు ఉన్న ఐఏఎస్ అధికారి ఆస్తుల గురించి బయటకు వచ్చాయి. ఇప్పటికే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ భూముల పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక 2018 ఎన్నికల సమయంలో .. ఈసీ తరపున పని చేసిన అధికారి పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారు చాలా కొద్ది మందే. వారే అత్యధికంగా ప్రాధాన్య పోస్టులు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్నారు. వారే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వీరందరి సమాచారం కాంగ్రెస్ వద్ద ఉంది. ఇప్పుడు అధికారంల చేతుల్లోకి రావడంతో మెల్లగా ఒక్కో విషయం బయటకు తెస్తున్నారు. ఆరోపణలు చేసినట్లుగా కాకుండా ఆధారాలతో సహా దొరికిపోతున్నట్లుగా ప్రొసీజర్ ను ప్రభుత్వం ప్లాన్ చేయడమే ఆసక్తికరంగా మారింది.
అయితే వీరు ప్రభుత్వం మారే వరకూ దిలాసాగానే ఉన్నారు. ప్రభుత్వం మారదని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి దొరికిపోతున్నారు. ఏపీలో అయితే ప్రభుత్వం మారకుండానే పెద్ద ఎత్తున అధికారులు సస్పెండ్ అవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎంత మంది జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందో అంచనా వేయడం కష్టమేనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.