ఐడియా, వోడా ఫోన్, ఎయిర్ టెల్, డొకోమో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వాళ్ళ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి మరో 25 ఫోన్ నెంబర్ల తాలూకు కాల్-డాటాని సీల్డ్ కవర్లో అందించారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు 29 నెంబర్ల సంబంధించిన కాల్-డాటాని సీల్డ్ కవర్లో కోర్టుకి అందించారు. హైకోర్టు ఆదేశానుసారం రెండుసార్లు కూడా ఆ సీల్డ్ కవర్లను ప్రత్యేక దూత ద్వారా తిరిగి హైకోర్టుకి పంపించబడ్డాయి. సుప్రీం కోర్టు ఆ వివరాలను విజయవాడ కోర్టుకి ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లను అనుమతించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీం ఆదేశాలను మన్నిస్తూ ఆ వివరాలను విజయవాడ కోర్టుకి సీల్డ్ కవర్లో పంపించడం తిరుగు టపాలో మళ్ళీ దానిని హైకోర్టుకి త్రిప్పి పంపిస్తుండటం జరుగుతోంది.
కాల్-డాటా వివరాలను తెరిచి చూసేందుకు అనుమతించనప్పుడు ఇదొక ప్రహసనంగా మిగులుతుందే తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నటికీ తన ఆరోపణలను నిరూపించలేదు. ఒకవేళ ఊహించని విధంగా ఓటుకి నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ప్రభుత్వం నోటీసులు పంపిస్తే అప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మరెవరికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు పంపించలేదు. ఎందుకంటే తన ఆరోపణలను రుజువు చేసే వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. అవన్నీ హైకోర్టులో భద్రపరచబడ్డాయి. అవి తెరిచి చూడాలనుకొంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనుమతి అవసరం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న విజయవాడ కోర్టు అడిగినా ఆ వివరాలను కోర్టుకి చూపించలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ వివరాలు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈకేసును వచ్చేనెల 10కి విజయవాడ కోర్టు వాయిదా వేసింది.