నిర్బంధ ఇంగ్లిష్ మీడియం విషయంలో పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలిదింది. ఈ మేరకు ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను కొట్టి వేస్తూ..ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ… ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల ఇరవై ఐదో తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధం చేయాలని.. తెలుగు మీడియంను రద్దు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో జీవోలు విడుదల చేసింది.అయితే.. ఆ జీవోలు రాజ్యాంగంలోని ప్రాధమిక విద్య హక్కులకు.. విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని చెబుతూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు… ప్రభుత్వ జీవోలను కొట్టి వేసింది. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలన్న లక్ష్యంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఏ మీడియం అనేది.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టం కావడంతో.. ఆ మేరకు.. తల్లిదండ్రుల వద్ద నుంచి వాలంటీర్ల ద్వారా అఫిడవిట్లు సేకరించారు. ఆ అఫిడవిట్ల ఆధారంగా.. 80 శాతానికిపైగా తల్లిదండ్రులు.. ఇంగ్లిష్ మీడియం కోరుతున్నారని చెబుతూ.. హైకోర్టు తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ప్రపంచంలో ఏ దేశం కూడా మాతృభాషను పూర్తిగా రద్దు చేసి.. ఇంగ్లిష్ మీడియంను పెట్టాలన్న ఆలోచన చేయలేదు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని.. విద్యాహక్కు చట్టం చెబుతోంది. అయితే.. వీటన్నింటినీ.. ఏపీ సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు. చట్టాలు.. రాజ్యాంగాలను లెక్కలోకి తీసుకోకుండా జీవోలిచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు వచ్చిన తర్వాత రాజకీయ పరమైన ఎదురుదాడి చేసింది. తెలుగు మీడియం అని డిమాండ్ చేస్తున్న వారి పిల్లలు.. ఏ మీడియంలో చదువుతున్నారని వైసీపీ నేతలు… ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.