కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మారిషస్ బ్యాంకుకి ఆ సంస్థ చెల్లించాల్సిన రూ. 100 కోట్లను ఐదు నెలల్లోగా చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పును సమర్ధించింది. సుజనా ఇండస్ట్రీస్ మారిషస్ బ్యాంకుకి నిర్దేశిత గడువులోగా రూ. 100 కోట్లను చెల్లించాలని సుప్రీం కోర్టు ఈరోజు తన తీర్పులో పేర్కొంది.
ఈ కేసులో ఆయన ఇప్పటికే చాలా అప్రదిష్టపాలయ్యారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవడంతో ఆయనకి ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా తెదేపా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ జూన్ నెలలో ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తికావస్తోంది. ఒకవేళ ఈ కారణంగా ఆయనకు మళ్ళీ రాజ్యసభకి పంపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాకరించినట్లయితే, ఆయన తన కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేయవలసి ఉంటుంది. ఆయనని మళ్ళీ రాజ్యసభకు పంపినా ప్రతిపక్షాల నుండి అందుకు విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనను వెనకేసుకొని వచ్చినా అవినీతి మరక అంటుకొన్న కారణంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనను తన మంత్రివర్గంలో కొనసాగనిస్తారో లేదో చెప్పలేము. కనుక ఈ తీర్పు వలన ఆయన కంపెనీకే కాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకి, తెదేపాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చును.