ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా విశాఖలో సెటిల్మెంట్లు చేస్తున్నారట. బాథితులు నేరుగా తెరపైకి వచ్చి తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ తమ భూ వివాదంలో తల దూర్చారని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరుకు చెందిన వెంకటస్వామి, కూండ్రపు వరలక్ష్మి మీడియా సమవేశం పెట్టి ఆరోపించారు. భూ సమస్య పరిష్కారం కోసం మే పదో తేదీన తాము అనకాపల్లి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లగా, అక్కడ వాసిరెడ్డి పద్మ, తమ ప్రత్యర్థి పీఆర్ఎస్ నాయుడు ఉన్నారన్నారు.
దుప్పితూరు భూ వివాదంలో నాయుడికి మద్దతు ఇవ్వాలని జిల్లా అధికారులను పద్మ కోరినట్టు వారు ఆరోపించారు. పద్మ దగ్గర పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస్ కిందిస్థాయి అధికారులను తరచూ కలుస్తూ ఈ భూమి నాయుడికి దక్కేలా ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి మే పదో తేదీన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించాలని .. వాటిని బయట పెట్టాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాసిరెడ్డి పద్మ.. తాను సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించిన మాట అవాస్తవమని తాను ఎవరినీ బెదిరించలేదనిప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎక్కడెక్కడి వైసీపీ నేతలంతా.. విశాఖలో వివాదాస్పద స్థలాలను సెటిల్మెంట్ చేసేందుకు విశాఖలో వాలిపోతున్నారు. అసలు విశాఖతో సంబంధం లేదని వాసిరెడ్డి పద్మ విశాఖ భూ వివాదంలో జోక్యం చేసుకోవడం అంటే.. చిన్న విషయం కాదు. ఎవరి స్థాయిలో వారు దందాలతో వెనుకేసుకునేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో … విశాఖ నలిగిపోతోందని .. ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు.