హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లిన వాళ్ల చూపు పోయే పరిస్థితి ఏర్పడింది. శుక్లాలకు ఆపరేషన్ చేయించుకున్న 13 మందికి తీవ్ర ఇన్ ఫెక్షన్ సోకింది. ఏడురు కంటి చూపునే కోల్పోయారు. చూపు మెరుగవుతుందని ఆశతో వస్తే బతుకు చీకటైపోయిందని వాళ్లు పడే బాధ వర్ణనాతీతం.
సరోజనీ దేవి దవాఖాన అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్పత్రి. ఇది ఒక్కపటి మాట. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ తెలంగాణలో ఎవరికి కంటి సమస్య వచ్చినా గుర్తుకు వచ్చిన పేరు ఇదే. అప్పట్లో నిత్యం వేల మంది రోగులు ఈ ఆస్పత్రికి వచ్చే వారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వార్డులు కిటకిటలాడేవి. రానురానూ పరిస్థితి మారిపోయింది.
రోగుత పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునే ప్రయివేట్ కంటి ఆస్పత్రులతో ఇది పోటీ పడలేకపోయింది. చాలా మంది వైద్యుల్లో చిత్తశుద్ధి తగ్గిపోయింది. కొందరు ప్రయివేటు ప్రాక్టిస్ మోజులో పడి సరిగా పనిచేయని పరిస్థితి ఎదురైంది. ఎంతో అనుభవం, అర్హత గల డాక్టర్లే సరోజిని దేవి దవాఖానకు పెద్ద ఆస్తి. కానీ క్రమంగా ఇక్కడి వైద్య సేవలపై రోగుల్లో నమ్మకం సడలింది. చిత్తశుద్ధితో చికిత్స చేసేది కొద్ది మంది డాక్టర్లయితే మొక్కుబడిగా పనిచేసే వాళ్లే ఎక్కువ మంది. దీంతో ఇక్కడి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది.
కనీసం తక్కువ సంఖ్యలో వచ్చే రోగులకైనా సరైన చికిత్స చేస్తే సంతోషమే. కానీ జూన్ 30న డాక్టర్ల నిర్వాకం వల్ల ఏడుగురు రోగులు కంటి చూపును కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్లు ఎవరో విచారణలో తేలుతుంది. వాళ్లపై ప్రభుత్వం ఏవో క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. మరి కంటి చూపు కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఏమిటి? దీనికి ప్రభుత్వమే జవాబు చెప్పాలి.