కేంద్ర విమానయాన శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో కర్నూలు ఎయిర్ పోర్టును ఉపయోగించుకునే ప్రయాణికులు చాలా స్వల్పంగా ఉన్నారని నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని తేల్చింది. ప్రయాణికుల సంఖ్య ఇంకా ఇంకా పడిపోతే విమాన సర్వీసులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కడప ఎయిర్ పోర్టు నిరుపయోగంగా మారుతోంది. ప్రస్తుతం ఆపరేషన్‌లో కీలకంగా ఉన్న ఎయిర్ పోర్టులు నాలుగు ఉన్నాయి. విశాఖ, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి ఎయిర్ పోర్టులు యాక్టివ్ గా ఉన్నాయి. కడప, కర్నూలులో విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. బోగాపురం నిర్మాణంలోఉంది.
అయితే కొత్తగా మరో ఏడు ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది . నెల్లూరు, కాకినాడ, కుప్పం, నాగార్జున సాగర్, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. మంత్రి ఏపీకి చెందిన వారే కావడంతో కేంద్ర పౌరవిమానయానశాఖ ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి అంగీకరించింది. ఆయా జిల్లాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడితే ఎంత ఖర్చవుతుంది ? ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుంది ? ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్టమే. ఆయా జిల్లాల ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే విమానాల గురించి ఆలోచించాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. సమీప భవిష్యత్ లో ఎదుగుతారని అనుకోవడం కష్టమే . ఎందుకంటే విమాన ప్రయాణం తక్కువ సమయమే పట్టొచ్చు కానీ.. అంతకు ముందు ఉండే ప్రాసెస్ , వెయిటింగ్ ఇవన్నీ కలుపుకుంటే డబ్బులు ఉన్నా సరే వేరే ప్రయాణ మార్గం చూసుకోవడం మంచిదన్న అభిప్రాయానికి వస్తారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు విమానాశ్రయాలపై దృష్టిపెట్టి వాటి కోసం భూసేకరణ చేసి ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవడం తెలివైన పని కాకపోవచ్చు.
ఎయిర్ పోర్టులు ఎంత వరకు అవసరం.. ఎంత వరకు ఫీజిబులిటీ ఉంటుందనేది కేంద్ర విమానయానశాఖ తన ప్రమాణాల మేరకు నిర్దారిస్తుంది., ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయా చోట్ల విమాశ్రయాలు ఎంత మాత్రం వర్కవుట్ కావనే నివేదిక రావొచ్చు. అయితే పారిశ్రామిక అవసరాల కోసం ఎయిర్ స్ట్రిప్‌లు నిర్మిస్తే.. కనీసం ప్రైవేటు రంగానికి అయినా ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం ఉంది.