లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతును రాచిరంపాన పెడతారు. 50 వేల పర్సనల్ లోన్ తీసుకున్న సామాన్యుడిని వెంటాడి వేధిస్తారు. వేల కోట్లు ఎగ్గొట్టిన బడాబాబును కనీసం డిఫాల్టర్ అనడానికి కూడా సాహసించరు. మన దేశంలోని సర్కారీ బ్యాంకుల చైర్మన్లు, అధికారుల నిర్వాకమిది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దాదాపు 7 వేల కోట్ల రూపాయలను వివిధ బ్యాంకులకు బాకీ పడింది. పైసా చెల్లించకుండా కాలం గడుపుతోంది. విజయ్ మాల్యా జల్సాలకు మాత్రం అడ్డూ అదుపూ లేదు. క్రికెట్ పేరుతో ఆటలు, క్యాలెంటర్ అమ్మాయిలతో ఫారిన్ టూర్లు, విందులు, వినోదాలకు డోకా లేదు. అప్పులిచ్చిన బ్యాంకులు లబోదిబో మంటున్నాయి. వాటి ఉన్నతాధికారులు మాత్రం చలనం లేకుండా ఉన్నారు. దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అనేది విచారణలో తేలాలి.
ముంబైలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీబీఐ కొత్త చీప్ ఆగ్రహంగా ప్రసంగించారు. కింగ్ ఫిషర్ పై ఒక్క బ్యాంకు కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కనీసం ఉద్దేశ పూర్వక ఎగవేతదారు అని ప్రకటించడానికి భయపడ్డారా లేక మరేదైనా కారణం ఉందా అని కడిగిపారేశారు. అక్కడే ఉన్న అతిపెద్ద బ్యాంక్ ఎస్ బి ఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ముఖంలో కత్తి వేటుకు నెత్తురుచుక్క లేదు. ఎస్ బి ఐ ఎందుకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ చీఫ్ గట్టిగా నిలదీయడంతో గతుక్కుమన్నారు. పరిస్థితి విషమిస్తోందని అర్థమైన తర్వాత, విజయ్ మాల్యా అరెస్టు కోరుతూ ఎస్ బిఐ బెంగళూరు బెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే ఆయన పిటిషన్ ను విచారించడానికి ఆ కోర్టు నిరాకరించింది.
యునైటెడ్ స్పిరిట్స్ బోర్డు చైర్మన్ పదవికి విజయ్ మాల్యా మొన్ననే రాజీనామా చేశారు. అందుకు ప్రతిఫలంగా 75 మిలియన్ డాలర్లు పొందారు. తాను ఇక లండన్ వెళ్లి స్థిరపడతానని చెప్పారు. ఇంత జరిగినా ఎస్ బి ఐ సహా ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకుల పెద్దల్లో చలనం లేదు. ఆయన లండన్ కు ఉడాయిస్తే అప్పుల పరిస్థితి ఏమిటనే ఆలోచన కూడా వాళ్లకు రాలేదు. దీనికి కారణం ఏదైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు సీబీఐ చీఫ్ తలంటడంతో ఎస్ బిఐ లో చలనం వచ్చింది. అయితే, మాల్యాను అరెస్టు చేసినంత మాత్రాన రుణాలు రికవరీ అవుతాయా? తగిన గ్యారంటీ లేకుండా ఇచ్చిన ఇంత భారీ రుణాన్ని ఆయన తీర్చడం అసాధ్యమే అంటున్నారు. అలాంప్పుడు ఆయన్ని అరెస్టు చేసినా ప్రయోజనం లేదు. అయితే, చేసిన మోసానికి జైలుకు పంపవచ్చు. మరి ఆ 7 వేల కోట్ల రూపాయల రాని బాకీలకు బాధ్యుల ఎవరు? ఏమో చెప్పలేం. ఇంతకీ విజయ్ మాల్యా కంపెనీ ఏయే బ్యాంకుకు ఎంత బాకీ ఉందో తెలుసా?
బ్యాంక్ రుణం (రూ. కోట్లలో)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,600
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 800
ఐడిబిఐ బ్యాంక్……………… 800
బ్యాంక్ ఆఫ్ ఇండియా……… 650
బ్యాంక్ ఆఫ్ బరోడా…………… 550
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 430
సెంట్రల్ బ్యాంక్…………………. 410
యూకో బ్యాంక్…………………. 320
కార్పొరేషన్ బ్యాంక్……………… 310
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 140
ఫెడరల్ బ్యాంక్…………………… 90
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 60
యాక్సిస్ బ్యాంక్………………….. 50
మరో 3 బ్యాంకులు………………. 603
మొత్తం 17 బ్యాంకులు………….. 6,963