బ్యాంక్ ని మోసం చేసి డబ్బు కాజేసిన కేసులో తెదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి ఏడేళ్ళ జైలు శిక్ష విధించబడింది. హైదరాబాద్ లోని సనత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ చెన్నారెడ్డి, బ్యాంక్ అధికారి చెరుకు ఉదయ కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎం.డి.షకీర్, కందికుంట వెంకట ప్రసాద్ కలిసి బ్యాంక్ ని మోసం చేసి రూ.8.29 కోట్లు దోచుకొన్నట్లు సిబిఐ కోర్టులో రుజువు చేయబడింది. ఈ కుట్రలో ప్రధానపాత్ర వహించిన కందికుంట వెంకట ప్రసాద్, చెరుకు ఉదయ కుమార్ లకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. బ్యాంక్ మేనేజర్ చెన్నారెడ్డి, మాజీ మంత్రి ఎండి షకీర్ 5సం.లు జైలు శిక్ష విధించింది. కేవలం జైలు శిక్షతోనె సరిపెట్టకుండా సిబిఐ కోర్టు అందరికీ బారీగా జరిమానాలు కూడా విధించింది. కందికుంట వెంకట ప్రసాద్, ఉదయ్ కుమార్ లకు రూ.13 లక్షల చొప్పున, చెన్నారెడ్డికి రూ.3 లక్షలు, షకీర్కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకలేకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. కోర్టు తీర్పు చెప్పగానే పోలీసులు వారినందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.
కొందరు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు అప్పుడప్పుడు ఇటువంటి మోసాలకు పాల్పడి పట్టుబడటం వింటూనే ఉంటాము కానీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఇటువంటి చిల్లర దొంగాతనాలకు పాల్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైకాపాని దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నిత్యం వేలెత్తి చూపించే తెదేపా ఇప్పుడు వైకాపా ముందు తలదించుకోవలసిన పరిస్థితిని కల్పించారు కందికుంట వెంకట ప్రసాద్. అయితే అటువంటి విమర్శలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెదేపా నేతలకు బాగా తెలుసు కనుక తమపై విమర్శలు చేసేవారిపైనే ఎదురుదాడి చేసి నోళ్ళు మూయించవచ్చు.
కేంద్రమంత్రులు మొదలుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం, వారిపై కేసులు నమోదు కావడం, జైలుకి వెళుతుండటం వంటివి మన రాజకీయ వ్యవస్థ నానాటికీ ఎంతగా దిగజారుతోందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. చట్టాలు చేసేవారే ఇటువంటి నేరాలకు పాల్పడుతుంటే ఇంక దేశాన్ని, ప్రజలని ఆ దేవుడే కాపాడాలి.