కడప జిల్లాలోని సున్నపురాయి గనుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనను వీలైనంత తక్కువగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది మంది .. తునాతనకలైనా.. అధికారులు శరవేగంగా స్పందించలేదు. ఆ గని యజమాని ఎవరు..? పేలుడు జరపడానికి పర్మిషన్ ఉందా..? పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి అనుమతులు తీసుకున్నారా..? అసలు ఆ గనుల్లో తవ్వుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారా..? వంటి అనేక మౌలికమైన ప్రశ్నలు ప్రమాదం జరిగిన వెంటనే వచ్చాయి. అయితే అధికారులు మాత్రం పరిశీలన చేస్తామని నింపాదిగాచెప్పారు. అధికారికంగా ఈ క్వారీ… వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య భార్య పేరు మీద ఉంది. ఆమె వేరే వైసీపీ నేతలకు పవరాఫ్ అటార్నీ ఇచ్చారు.
సాయంత్రానికి తెలిసిందేమిటంటే.. అసలు ఆ గనిని ఏడాది కిందటే మూసేశామని గతంలోనే అధికారులు ఓ వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చెప్పారు. ఈ విషయాన్ని మైదుకూరు నియోజకవర్గ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. అంటే మూసేసిన గనిలో పేలుడు జరిగింది. ఇతర వ్యవహారాలు దేనికీ పర్మిషన్ లేనట్లే. ఇలాంటి సమయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు లైట్ తీసుకున్నారు. మామూలుగా అయితే తక్షణం గని యజమానిని అదుపులోకి తీసుకోవాలి. కానీ అక్కడ గనిని అనధికారికంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ అనుమతులు కూడా లేవు.
ఆ పనులు చేయిస్తున్నది ఒకరు కాగా… అసలు లబ్దిదారులు వైసీపీ కీలక నేత అన్న ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా అధికారులు నోరు మెదిపే పరిస్థితి లేదు. తునాతునకలయిన పది మంది కూలీల కుటుంబాల పరిస్థితే దారుణంగా ఉంది. అక్రమంగా గనులు నిర్వహిస్తున్న వారి నుంచి .. ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఇప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అండగా ఉంటామని ప్రభుత్వం… చెబుతోంది కానీ… ఎలాంటి అండో మాత్రం ప్రకటన చేయలేదు. అక్రమ మైనింగ్‌కు బలైన ఆ పది కుటుంబాలు… అధికారులు.. రాజకీయ నేతల ధన దాహానికి బలైపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగినా అధికారులు ఎందుకు ఇంత అలక్ష్యం ప్రదర్శిస్తున్నారో.. చాలా మందికి అర్థం అవుతోంది. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో చిన్న చిన్న విషయాలకే పోలీసులు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సీన్లు క్రియేట్ చేస్తున్నారు. అధికారులు… సోదాలతో విరుచుకుపడుతున్నారు.కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు మాత్రం… పరిశీలన చేస్తాం.. చర్యలు తీసుకుంటామని నింపాదిగా మాట్లాడుతున్నారు. చట్టాన్ని కొంత మంది కోసమే ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నారు.