ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించి సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ కేసు పెట్టగా..ఆ తర్వాత యూట్యూబ్ ఫేమ్ హర్ష సాయి కూడా ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఇలా ఒక్కొక్కరిగా సెలబ్రిటీలపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతుండటం సంచలనం రేపుతోంది. ఈ క్రమలోనే తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన ఫోక్ సింగర్, రైటర్ , సుద్దాల మల్లిక్ తేజపై మామిడి మౌనిక అనే సింగర్ కేసు పెట్టింది.
యూట్యూబ్ ఛానెల్ లో ఫోక్ సాంగ్స్ పాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న మౌనిక.. సుద్దాల మల్లిక్ తేజ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడని.. స్టూడియోలోనే తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
అంతటితో ఆగకుండా తన యూట్యూబ్ ఛానెల్ ఐడీ, పాస్ వర్డ్ లు మార్చి వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.