అమలా పాల్ ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్నారు. నిన్న నకిలీ పత్రాలతో కారు కొన్న కేసులో అరెస్టవడమూ, వెంటనే బెయిల్ పై విడుదలవడమూ తెలిసిందే. అయితే తాజా గా మరొక ఘటన లో ఆమె ఒక వ్యాపారవేత్త పై పోలీస్ కంప్లైంట్ చేసారు. ఆయన తనని లైంగికంగా వేధిస్తున్నాడని చెన్నై లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులు స్పందించి, అతన్ని అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళ్తే..
అలగేశన్ అనే వ్యాపారవేత్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని అమలా పాల్ చెన్నైలోని పాండిబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు అలగేశన్ ని అరెస్టు చేశారు. తనను వేధించిన అలగేశన్ను కఠినంగా శిక్షించాలని అమలా పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నటిగా ఉన్న తనకే ఇలాంటి వేధింపులు ఎదురైతే, సామాన్య మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని అమలా పాల్ అన్నారు. మహిళలకు సమాజంలో భద్రత లేదని, మాటలతో చేతలతో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని అమలా పాల్ ఆందోళన వ్యక్తం చేశారు