హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై నాలుగు నెలలుగా జరుగుతున్న ఆందోళన, రాజకీయ స్వార్థ శక్తుల స్పాన్సర్ షిప్ తో నడుస్తోందా? అవును అంటున్నాడు, ఎస్.ఎఫ్.ఐ.కి రాజీనామా చేసిన విద్యార్థి నాయకుడు రాజ్ కుమార్ సాహు.
సీపీఎం అనుబంధ సంస్థగా పేరుపొందిన ఎస్.ఎఫ్.ఐ వ్యవహార శైలికి నిరసనగా ఆ సంస్థకు రాజీనామా చేశాడు. రోహిత్ మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్నది కాంగ్రెస్, వామపక్షాల స్పాన్సర్డ్ ఆందోళన అని తీవ్రమై ఆరోపణ చేశాడు.
అతడేదో దారినపోయే దానయ్య వంటి వాడు కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి. అంటే వేల మంది విద్యార్థులు ఓటు వేయడం వల్ల ఎన్నికైన విద్యార్థి నాయకుడు. అలాంటి వ్యక్తి, వామపక్షాల నిజస్వరూపం తెలుసుకోండంటూ గుట్టు విప్పాడు. కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది కూడా ఎండగట్టాడు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటూ స్పాన్సర్ చేస్తూ ఆందోళన అనేదాన్ని కొనసాగిస్తున్నారనేది సాహు ఆరోపణల సారాంశం.
ఈ రెండు రాజకీయ పక్షాల స్వార్థ రాజకీయాల వల్లే యూనివర్సిటీలో ప్రశాంతత లేకుండా పోయిందంటున్నాడు. అసలు రోహిత్ మరణంపై ఆందోళన చేస్తున్న హెచ్ సి యు జేఏసీని కూడా ఓ లేఖలో ఘాటుగా ప్రశ్నించాడు. కొంత మందిని లక్ష్యంగా చేసుకుని ఆందోళన చేస్తున్నారని వెల్లడించాడు. జేఏసీ నిధులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.
ఆందోళన పేరుతో జేఏసీ నాయకులు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలని అన్నాడు.
ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమంగా భావించి తానుకూడా పాల్గొన్నానని చెప్పాడు. కానీ దీన్ని రాజకీయ స్వార్థపర శక్తులు హైజాక్ చేశాయని అతడికి ఆలస్యంగా అర్థమైందట. వేరే ఉద్దేశాలున్న కొందరు ప్రొఫెసర్లు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ ఆందోళనను పెంచి పోషించారట. నిజంగా న్యాయం కావాలనే చిత్తశుద్ధి ఉంటే, విచారణ కమిషన్ కు వీళ్లెవరూ ఎందుకు సహకరించడం లేదని సాహు ప్రశ్నిస్తున్నాడు.
రోహిత్ ఒకప్పుడు ఎస్ ఎఫ్ ఐ లో చురుగ్గా ఉండేవాడట. కానీ ఆ సంస్థ వ్యవహార శైలి నచ్చక అంబేద్కర్ విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేసి ఉంటాడని సాహు అభిప్రాయపడ్డాడు. విద్యార్థి రాజకీయ ప్రభావం వల్ల రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అభిప్రాయాలకు సరిపోయేలా సాహు అభిప్రాయం వినిపించడం విశేషం. పైగా రోహిత్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో లేని పేర్లను ప్రస్తావిస్తారు. తమకు నచ్చని, తాము టార్గెట్ చేసిన కొందరిపై దుమ్మెత్తి పోస్తారు. వాళ్ల పదవులు ఊడబెరకాలని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్లలో రాజకీయ కక్షలు స్పష్టంగా కనిపిస్తాయి.
సాహు అల్లాటప్పా వ్యక్తి కాదు. అతిపెద్ద యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి. వామపక్ష నేతలు, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడి మాటలను ఉటంకిస్తూ అధికార పార్టీపై దాడి చేస్తుంటారు. అతడికి ఓ హీరోగా ఫోకస్ చేస్తుంటాడు. కన్హయ్య ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రకటనలు చేస్తారు. అంటే విద్యార్థి సంఘం నాయకుడి మాటలు విలువ ఉంటుందనే అర్థం.
సాహు కూడా ఓ పెద్ద యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి అంటే అదేమీ చిన్న విషయం కాదు. వామపక్ష నేతల జేఎన్ యు వాదననే పరిగణన లోకి తీసుకుంటే సాహు మాటలు కూడా అక్షర సత్యాలే అని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ బడా నాయకులు, కామ్రేడ్లు సాహు అభిప్రాయాలతో ఏకీభవిస్తారా? అతడు చెప్పేది నిజమేనని ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్లే చెప్పాలి.