తెలుగు360 రేటింగ్ 2.5/5
చిన్న లైన్లు పట్టుకోవడం – చాలా ఈజీ పని. లైన్లో కాస్త మెరుపు ఉంటే చాలు. `వర్కవుట్ అయిపోతుందే` అనే ధీమా మొదలైపోతుంది. అయితే ఆ లైన్ ని రెండు గంటల సినిమాగా మార్చడంలోనే దర్శకుడి ప్రతిభా పాటవాలు బయటపడతాయి. చిన్న సినిమాలకు భారీ హంగులు ఉండవు. స్టార్లు ఉండరు. మ్యాజిక్కులతో జిమ్మిక్కులు చేసే వీలు ఉండదు. కేవలం `లైన్లు` నడిపించాలి. అలాంటి లైన్లు చాలాచ సినిమాల్లో కనిపిస్తున్నాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే వర్కవుట్ అవుతున్నాయి. అలా వర్కవుట్ అయ్యే జాబితాలో చేరే సినిమా `షాదీ ముబారక్`.
ముందే చెప్పినట్టు ఈ సినిమాలో పెద్దగా కథేం ఉండదు. చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. అస్ట్రేలియా నుంచి వచ్చిన పెళ్లి కొడుకు మాధవ్ సున్నిపెంట (సాగర్)… ఒకే రోజు మూడు పెళ్లి చూపులు చూసుకోవాల్సి వస్తుంది. ఆ పెళ్లి చూపులకు మ్యారేజ్ బ్యూరో తరపున సత్యభామ (దృశ్య) కో ఆర్డినేట్ చేస్తుంది. సత్యభామ పనేంటంటే.. పెళ్లి కొడుకుతో.. మూడు పెళ్లి చూపులకూ హాజరు కావడం. ఈ ప్రయాణంలో… మాధవ్, సత్యభామ ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారన్నది కథ.
లైన్ గా చెబితే – `ఇందులో ఏముంది` అనిపిస్తుంది. కానీ… `భలే బాగుందే` అన్నట్టుగా దర్శకుడి ట్రీట్ మెంట్ సాగింది. నిజానికి ఈ పాయింట్ లోనే కావల్సినంత ఫన్ ఉంది. మాధవ్ ఒకే రోజు.. మూడు పెళ్లి చూపులకు హాజరు కావడం, మూడు చోట్లా విభిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకోవడం – ఈ ప్రయాణంలో మాధవ్, సత్యభామల మధ్య సరదా సీన్లు రాసుకోవడంతో.. అసలు టైమ్ ఎప్పుడైందో, ఇంట్రవెల్ కార్డు ఎప్పుడు పడిందో తెలీయకుండా పోతుంది. దర్శకుడు.. ఫన్ పండించడానికి… ఎలాంటి గారడీలూ చేయలేదు. కేవలం… ఉన్న పాత్రలనే తెలివిగా వాడుకున్నాడు. వాళ్లమ మధ్య సరదా సంభాషణలు రాసుకున్నాడు. ముఖజ్ఞంగా ఇంటి పేరు చుట్టూ నడిచే వినోదం.. హాయిగా ఉంటుంది. దాదాపు గంట సేపు కారు ప్రయాణం సాగడం, ఆ కార్లో ముగ్గురు మాత్రమే ఉండడం, వాళ్ల మధ్యే సన్నివేశాలు నడిపించడం..
మామూలు విషయం కాదు. ఏమాత్రం… విసుగు అనిపించినా, ప్రేక్షకుడు థియేటర్ నుంచి లేచి బయటకు వెళ్లిపోతాడు. అసలు ఆ అవసరం, ఆ ఆలోచన లేకుండా.. గమ్మత్తు చేశాడు దర్శకుడు. ముఖ్యంగా… అజయ్ ఘోష్‌తో `కుమ్మేశా` అనే చిన్న మాటతో సాగే.. ఎపిసోడ్.. కుమ్మి పడేసింది. ప్రతీ సన్నివేశంలోనూ.. చిన్నపాటి స్మైల్ ప్రేక్షకుడి పెదవులపై ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు.
ప్రధమార్థం ఎలాంటి కంప్లైంట్లూ లేకుండా సాగి… ఈ సినిమాపై బోలెడంత భరోసా కలిగుతుంది. ద్వితీయార్థం పై మాత్రం అంచనాలు పెరుగుతాయి. నిజంగా సెకండాఫ్ నీ ఇంతే హాయిగా సాగిపోతే.. ఈ సినిమా మరో `పెళ్లి చూపులు` అయ్యేది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు… కథ, కథనంలో వేగాన్ని తగ్గిస్తాయి. హీరోయిన్ మరొకరితో పెళ్లికి ఒప్పుకోవడం – అనే ఎత్తుగడ ఈ సినిమా వేగానికి కళ్లెం వేసింది. దాంతో కొన్ని అనవసరమైన సన్నివేశాలు రాసుకోవాల్సివచ్చింది. సీరియల్ స్టార్ గా ఝాన్సీ పై తెరకెక్కించిన సీన్లు మరీ అంత గొప్పగా లేవు. దాంతో.. ఫస్టాఫ్‌లో చూసిన ఫన్ తగ్గిందనిపిస్తుంది. పైగా పాటలు మరో స్పీడ్ బ్రేకర్. అయితే.. మళ్లీ దర్శకుడు కళ్లెం పట్టుకోవడానికి పెద్దగా శ్రమ పడలేదు. హెవీ డ్రామా సీన్లు ఏం రాసుకోకుండా… లైటర్ వే లోనే సినిమాని ముగించాడు. మొత్తంగా.. ఓ సరదా సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. పాటలు బాగుండి, సెకండాఫ్ లో ఇంకొంత ఫన్ క్రియేట్ చేసుకుంటే తప్పకుండా షాదీ ముబాకర్.. చిన్న సినిమాల్లో ఓ మెరుపులా మారేది. ఇప్పటికీ తక్కువేం కాదు. ఎలాంటి అంచనాలూ లేకుండా సినిమా చూసినవాళ్ల టికెట్ రేటు గిట్టుబాటు అయ్యేలానే ఈ సినిమా ఉంది.
టీవీ ఆర్టిస్టుగా సాగర్ సుపరిచితుడే. తన పరిధిమేర నటించాడు. వయసు దాటి పోతున్నా – పెళ్లి కాని ప్రసాద్ టైపు పాత్రకి తాను సూటయ్యాడు కూడా. కథానాయిక దృశ్యకు మాత్రం సాగర్ కంటే కొంచెం ఎక్కువ మార్కులే వేయాలి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చేస్తాయి. డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. అజయ్ ఘోష్ నవ్వించాడు. సాక్షి రామ్ రెడ్డి తండ్రి పాత్రలో మెప్పించాడు.
ఇది దర్శకుడి సినిమా. చిన్న పాయింట్ తో రెండు గంటలు లాక్కురావడం సామాన్యమైన విషయం కాదు. సన్నివేశాల్లో బలం ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. పద్మశ్రీకి ఈ సినిమా తరవాత మంచి ఛాన్సులు వస్తాయి. పాటలపై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. ఒక్క మంచి పాట ఉన్నా – ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేది. బడ్జెట్ పరిమితులు కనిపించాయి. రీషూట్లు జరిగినట్టు అర్థమవుతోంది. చిన్న పాయింట్… సున్నితమైన వినోదం, సరదా సన్నివేశాలతో… టైమ్ పాస్‌కి ఢోకా లేకుండా చేసిన సినిమా ఇది. చిన్న సినిమాల్లో తప్పకుండా తన మార్క్ చూపించుకుంటుంది.
తెలుగు360 రేటింగ్ 2.5/5