చిన్న పాయింట్ తో సినిమా తీయడం.. సింపుల్ విషయమేం కాదు. ఆ పాయింట్ తో రెండు గంటలు కూర్చోబెట్టాలంటే, చాలా దమ్ము కావాలి. ఈమధ్య `ఎవరికీ చెప్పొద్దు` అనే ఓ చిన్న సినిమా వచ్చింది. `కులం` అనే బలమైన కాన్లిఫ్ట్ ని ఓ చిన్న లైన్‌గా తీసుకుని ఆ సినిమాని నడిపారు. ఇప్పుడు `షాదీ ముబారక్` అనే మరో సినిమా వస్తోంది. ఈ కథంతా ఇంటి పేరు చుట్టూ తిరుగుతుంది.
ఓ అమ్మాయికి తన ఇంటి పేరు నచ్చదు. పెళ్లయ్యాక… ఇంటి పేరు ఎలాగూ మారుతుంది కదా, అని… మంచి ఇంటి పేరున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తీరా చూస్తే.. `సున్నిపెంట` అనే ఇంటి పేరున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. ఆ ఇంటి పేర్ల గొడవతో ఎంత ఫన్ పండిందో, అందులో ప్రేమ ఎలా పుట్టిందో చెప్పే కథ ఇది. లైన్ చాలా సింపుల్ గా ఉన్నా, ఫన్ పుట్టించడానికి కావల్సినంత మేటర్ ఉంది.
బుల్లి తెర పవర్ స్టార్ అని పిలుచుకునే… సాగర్ (ఆర్.కె.నాయుడు) ఈ సినిమాలో హీరో. మొగలి రేకులు సీరియల్ చూసినవాళ్లకు సాగర్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ సిరియల్ ద్వారా చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. తన లుక్ కొత్తగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది… దృశ్య రఘునాథ్. ఓ రకంగా చెప్పాలంటే.. సినిమాలో హీరో క్యారెక్టర్ ని పూర్తిగా డామినేట్ చేసే పాత్రలా అనిపిస్తోంది. అమ్మాయి క్యూట్ గా ఉంది. సునీల్ కాశ్యప్ నేపథ్య సంగీతం రొమాంటిక్ గా సాగింది. విజువల్స్ బాగున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం చూస్తుంటే – ఈ సినిమాపై నమ్మకం పెట్టుకోవచ్చనిపిస్తోంది. మరి షాదీ ముబారక్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.