Shaakuntalam Movie review
తెలుగు360 రేటింగ్ : 2/5
తెలుగు చిత్ర పరిశ్రమని భారీ చిత్రాలవైపు బాటలు వేయించిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాని కొత్త హంగులతో ప్రేక్షకులకు చూపించాలనే తాపత్రయ పడే దర్శకుడాయన. ఇక పౌరాణికాలపై కూడా ఆయనకి మంచి పట్టుంది. కెరీర్ ఆరంభంలోనే బాల రామాయణంతో నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రుద్రమదేవి లాంటి చారిత్రత్మ చిత్రాన్ని కూడా అందించారు. రుద్రమదేవి తర్వాత హిరణ్య కశ్యప అనే మరో పౌరాణిక చిత్రం కోసం దాదాపు ఐదేళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. మరో పౌరాణికం కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంపై ఆయన ద్రుషి పడింది. సమంత ప్రధాన పాత్రలో భారీ హంగులు సాంకేతికతని జోడించి ‘శాకుంతలం’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారతీయ సాహిత్యంలో అభిజ్ఞాన శాకుంతలం ఒక క్లాసిక్. కాళిదాసు రచన శైలి పాఠాకులని కట్టిపడేస్తుంది. అయితే ఇలాంటి క్లాసిక్స్ ని తెరపైకి తీసుకురావడం కూడా ఒక సవాలే. మరీ ప్రేమకావ్యం ఎంత అందంగా, ఆకర్షణీయంగా తెరపైకి వచ్చింది ? ఈ ప్రేమ కావ్యంలోని అనుభూతిని ప్రేక్షకులకు పంచడంలో గుణశేఖర్ విజయం సాధించారా?
ఇంద్రుని ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేసేందుకు వచ్చిన మేనక.. మహర్షికి శారీకంగానూ దగ్గరవుతుంది. ఫలితంగా ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అయితే నరుడి వల్ల కలిగిన ఆ బిడ్డకు దేవలోకంలో ప్రవేశం లేదు. దీంతో ఆ చిన్నారిని భూలోకంలోనే వదిలి దేవలోకానికి వెళ్ళిపోతుంది మేనక. ఆ చిన్నారిని శాకుంతలములు అనే పక్షుల గుంపు కణ్వాశ్రమ ప్రాంతంలో విడిచిపెడతాయి. కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) ఆ చిన్నారికి శకుంతల (సమంత) అని పేరు పెట్టి.. దత్తత తీసుకుంటాడు. శాకుంతుల ఆశ్రమంలోనే పెరుగుతుంది.
హస్తినాపురానికి రాజు దుష్యంతుడు (దేవ్ మోహన్). ఒకానొక రోజు వన్యమృగాలని వేటాడుతూ కణ్వాశ్రమానికి వస్తాడు. అప్సరస లాంటి శకుంతలని చూసి తొలిచూపులోనే మనసుపడతాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకొని శారీరకంగా ఒక్కటౌతారు. రాచ మర్యాదలతో రాజ్యానికి ఆహ్వానించి,మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని శకుంతలకు మాట ఇచ్చి దుష్యంతుడు, తన గుర్తుగా ఓ ఉంగరం ఇచ్చి రాజ్యానికి బయలుదేరుతాడు. కొన్నాళ్లకు శకుంతల గర్భవతి అవుతుంది. దుష్యంతుడి రాక కోసం ఎదురుచూస్తుంటుంది. ఎంతకీ రాకపోవడంతో శకుంతలనే దుష్యంత రాజ్యానికి పంపిస్తాడు కణ్వ మహర్షి. అయితే దుష్యంత రాజ్యానికి వెళ్ళిన ఆమెకు నిండు సభలో ఊహించని పరాభవం ఎదురవుతుంది. శకుంతలని చూసిన దుష్యంతుడు అసలు తను ఎవరో గుర్తులేదని చెప్తాడు. అదే సమయంలో దుష్యంతుడు బహూకరించిన ఉంగరాన్ని కూడా పోగొట్టుకుంటుంది శకుంతల. దీంతో అందరూ ఆమెను మహారాజుకు అప్రతిష్ట తీసుకురావడానికి కుట్ర చేసిన కులత అనే ముద్ర వేస్తారు. అసలు దుష్యంతుడు.. శకుంతలను ఎలా మర్చిపోవయాడు ? ఎందుకు మర్చిపోయాడు ? శకుంతల ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుంది? దుష్యంతుడికి మళ్ళీ గతం గుర్తుకు వచ్చిందా ? విళ్లిద్దరూ తిరిగి కలిశారా ?లేదా ? అనేది మిగతా కథ.
కాళిదాసు రచన శైలి అద్భుతం. ఆయన కల్పన శక్తి అమోఘం. శైలి, శిల్పం, చిత్రీకరణ, ఉపమానాలు.. పాఠకుడిని మంత్రుముగ్ధుల్ని చేస్తాయి. అభిజ్ఞాన శాకుంతలం కూడా ఓ అపురూప రచనే. అలాంటి రచనని కెమరాతో బంధించి వెండితెరపై ఆవిష్కరించాలనే దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయమే కానీ.. ఆ రచనని తెరపైకి తీసుకుకొచ్చి ప్రేక్షకుడిని మంత్రుముగ్ధుల్ని చేయడంలో దర్శకుడి కల్పనా శక్తి, నేర్పు సరిపోలేదనిపిస్తుంది.
ఇలాంటి క్లాసిక్ ని సినిమాగా చిత్రీకరిస్తున్నపుడు ఏది తీయాలి, ఏది చూపించాలి, ఏది సినిమాకు అవసరం అనే జడ్జ్మెంట్ చాలా బలంగా వుండాలి. ఈ విషయంలో గుణశేఖర్ చాలా చోట్ల తడబడ్డారు. చిన్నారి శాకుంతులం ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. కణ్వాశ్రమాన్ని చాలా అందంగా రమణీయంగా చూపించే విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఓ చెట్టు పొదలో చిన్నారి చూసిన కణ్వ మహర్షి .. మేనక, విశ్వమిత్రుల కథని చెప్తారు. అయితే ఈ కథని స్కెచ్ ఇమేజ్ లతో సరిపెట్టేశారు. బాల్యం ముగిసిన తర్వాత.. దుష్యంత రాజు ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. వన్యమృగాలు వేట, రాజు పరాక్రమం ..చదువుతున్నపుడు అద్భుతంగా వుంటుంది గానీ తెరపైకి మాత్రం అంత ప్రభావంతంగా రాలేదు.
ఈ ప్రేమ కావ్యంలో కీలక ఘట్టం.. శాకుంతుల, దుష్యంతల పరిచయం. తొలి చూపులోనే ప్రేమ. ఈ ఘట్టాన్ని గుణశేఖర్ మరీ రెగ్యులర్ గా తీసేశారనే ఫీలింగ్ కలుగుతుంది. వారి ప్రేమలో లోతు ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. దుష్యంతుడు సగటు కమర్షియల్ సినిమాల్లో హీరోలానే కనిపిస్తాడు తప్పితే రచనలోని భావుకత తెరపైకి రాలేదు. తర్వాత వచ్చే సన్నివేశాలని సాగదీతగా తీసుకుపోయారు. మధ్యలో అసుర మూక కాలానీముల ట్రాకు, ఆశ్రమంలో వున్న స్నేహితులు చెప్పుకునే ఉపకథలు .. ఈ ప్రేమ కావ్యంలోని ఘాడతని తగ్గించేస్తుంటాయి. దుర్వాస మునిగా మోహన్ బాబు రంగప్రవేశం చేసిన తర్వాత కథ ఒక మలుపు తిరుగుతుంది. అయితే ఈ పాత్ర ప్రవేశం మలుపు కోసమే అన్నట్టుగా చూపించడం అంతగా ఆకట్టుకోదు.
ఇది శకుంతల కథ. కానీ దృష్యంతుడి కోణంలో చెప్పుకొంటూ పోయారు. శకుంతలని క్యారెక్టర్ని ఫాలో అయితే తప్ప.. ఆమె బాధకీ, విరహానికీ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. ఇది… ఈ సినిమాలో పెద్ద లోపంగా కనిపిస్తుంది.
ఈ ప్రేమకథకు ప్రదమార్ధంలో సాగదీత ఇబ్బంది పెడితే.. రెండో సగంలో కథే ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. నిండు సభలో శకుంతులకు జరిగిన అవమానం మెప్పిస్తుంది. తర్వాత నిజం తెలుసుకున్న దుష్యంతుడు.. ప్రేమ కోసం అన్వేషించే తీరు మాత్రం ఆకట్టుకోదు. భూలోకంలో కూతురు పడుతున్న బాధలు చూసి దేవలోకంలో చలించిపోయే మేనక ట్రాక్.. ఒక డైలీ సీరియల్ సీన్స్ ని తలపిస్తుంది. అసురులు, దేవతలు చేసిన యుద్ధం కూడా చాలా కుత్రిమంగా వుంటుంది. ముగింపు కు ముందు వచ్చే అల్లు అర్హా ప్రజన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.
పౌరాణిక పాత్రలు మోయడం అంత సులువు కాదు. టైటిల్ రోల్ చేసిన సమంత తన శక్తి మేరకు కృషి చేసింది. ఎమోషనల్ సీన్స్ చక్కగా చేసింది. అయితే ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె కంట్లో ఎదో బాధ కనిపిస్తూనే వుంటుంది. దీంతో చాలా చోట్ల ఒకటే ఎక్స్ ప్రెషన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ బావున్నాడు కానీ.. సమంతతో తన కెమిస్ట్రీ కుదరలేదు. ఆ పాత్రకు కాస్త ఇమేజ్ వున్న స్టార్ ని తీసుకొని వుంటే ప్రేమకథ ఇంకా కనెక్టింగా వుండేది. మోహన్‌బాబు హుందాగా చేశారు. అనన్య,మధుబాల, సచిన్, గౌతమీ, శివబాలాజీ .. మిగతా నటులంతా పరిధి మేర కనిపిస్తారు. అల్లు అర్హ చలాకీగా కనిపించింది.
త్రీడీలో లోపాలు వున్నాయి. చాలా ఫ్రేములు తేడాగా కనిపించాయి. ముఖ్యంగా తలలు కొంగలా ముందుకు వచ్చి కనిపించడం ఇబ్బంది పెట్టింది. ఖర్చు తెరపై కనిపిస్తుంది. మణిశర్మ పాటలు తేలిపోయాయి కానీ నేపధ్య సంగీతం బావుంది. మాటలు అంతగా ఆకట్టుకోవు. రచనగా శాకుంతులం ఓ అందమైన ప్రేమ కావ్యం. అది వెండితెరపై దృశ్య కావ్యంగా మలచడంలో గుణశేఖర్ తడబడ్డారు.
తెలుగు360 రేటింగ్ : 2/5