తెలుగులో రాజమౌళి తరవాత… మేకింగ్ పై అంతగా దృష్టి పెట్టే దర్శకుడు… గుణశేఖర్. రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలో, తన అభిరుచులకు అనుగుణంగా తీశారాయన. ఇప్పుడు `శాకుంతలమ్` మలిచారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని త్రీడీలో నిర్మించారు. ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ ఆవిష్కరించారు. 2 నిమిషాల 45 సెకన్ల పాటు సాగే ట్రైలర్ ఇది. విజువల్ వండర్ గా ఈ సినిమాని మలచడానికి గుణశేఖర్ పడిన కష్టం, పెట్టిన ఖర్చూ రెండూ కనిపిస్తున్నాయి.
ఇదో అందమైన ప్రేమ కథ. నవ నాగర చరిత్రకు నాంది పలికిన శకుంతల కథ. శకుంతల ఎవరికి పుట్టింది? తన బాల్యం ఏమిటి? తన ప్రేమ కథ, తనకు ఎదురైన అవమానాలు, వాటిని దాటుకొచ్చిన వైనం.. ఇవన్నీ పురాణాల్లో చదివాం. తెలుసుకొన్నాం. వాటికి దృశ్యరూపం ఇచ్చాడు గుణశేఖర్. శకుంతల ఎంట్రీ… రంగు రంగుల శీతాకోక చిలుకలలోంచి సమంతని చూపించడం.. బాగుంది. త్రీడీ ఎఫెక్ట్స్ కోసం కొన్ని షాట్లు కంపోజ్ చేశారు. వాటిని వెండి తెరపైనే చూడాలి. సమంత లుక్ బాగుంది. దుర్వాశ మహర్షిగా మోహన్ బాబు కొన్ని షాట్స్ లో కనిపించారు. భారీ కోటలు, వార్ సీక్వెన్స్… ఇవన్నీ తెరపై దర్శనమిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు గుణశేఖర్. మరి.. ఆ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.