బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓ ప్రైవేటు క్రూయిజ్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు దాడి చేశారు. అక్కడ డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా పార్టీ చేసుకుంటున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్. అందరూ డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా తేల్చారు. వీరందర్ని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ కుమారుడి పేరు బయటకు వచ్చింది. అదుపులోకి తీసుకున్న మరో ఏడుగురిలో మరో స్టార్ హీరో కుమారుడి పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అందరి వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ అధికారులు అందులో నుంచి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు డ్రగ్ పెడ్లర్లు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి డ్రగ్స్ వ్యవహారం సంచలనాత్మకం అవుతోంది. అందరూ డ్రగ్స్‌కు బానిసలుగా మారారన్న విమర్శలు వస్తున్నాయి. అనేక మందిని ఎన్సీబీ విచారించింది. ఇలాంటి సమయంలోనూ ఏ మాత్రం వెరపు లేకుండా సూపర్ స్టార్ల సుపుత్రులు ఇలా సముద్ర తీరంలో ప్రత్యేకంగా క్రూయిజ్లలో పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం సంచలనాత్మకం అవుతోంది.
రేవ్ పార్టీ జరుగుతూండగా.. డ్రగ్స్ తీసుకుంటూండగా అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్సీబీ అధికారులు చెప్పారు. విచారించిన తర్వాత అరెస్ట్ చూపే అవకాశం ఉంది. ఈ ఘటన బాలీవుడ్లో పాతుకుపోయిన డ్రగ్స్ కల్చర్‌ను.. మరోసారి బయట పెట్టింది. నటులు మాత్రమే కాకుండా వారి పిల్లలు.. ఇంకా పూర్తిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఇలా మత్తు పార్టీలో మునిగి తేలడం సినీతారల జీవితాల్లోని.. వారి కుటుంబాల్లోకి డ్రగ్స్ ఎలా చొచ్చుకుపోయాయో నిరూపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.