అర్జున్ రెడ్డి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ ఓ ట్రెండ్ సెట్టర్. క్లాసిక్. సినిమాపై జనాల ఆలోచనా విధానాన్ని మార్చిన సినిమా. ఇలాంటి సినిమాని రీమేక్ చేయాలనుకోవడం సాహసమే. ఆ సాహసం బాలీవుడ్ చేసింది. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయ్యింది. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు. ‘అర్జున్ రెడ్డి’ సృష్టికర్త అయిన సందీప్ రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్లానే షాహిద్ కూడా మంచి నటుడు. ఎలాంటి సున్నితమైన భావాన్నయినా అద్భుతంగా పలికిస్తాడు. కాకపోతే.. `అర్జున్ రెడ్డి` మ్యాజిక్ – `కబీర్ సింగ్`లోనూ రిపీట్ అవుతుందా? అనేది అనుమానమే. ఓ క్లాసిక్‌ని రీమేక్ చేసిన ప్రతీసారీ రూపకర్తలకు గట్టి దెబ్బ తగులుతూనే ఉంది. మరి అర్జున్ రెడ్డి విషయంలో ఏమవుతుంది? ఈ నెల 21 వరకూ ఆగితే తెలిసిపోతుంది.
అయితే షాహిద్ మాత్రం ఈ సినిమాని అర్జున్ రెడ్డితో పోల్చకండి అంటున్నాడు. కబీర్ సింగ్ ప్రమోషన్లలో భాగంగా షాహిద్ కపూర్ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ”అర్జున్ రెడ్డి ఓ క్లాసిక్. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఇప్పటికి చాలాసార్లు చూసి ఉంటారు. ఆ జ్ఞాపకాల్ని అక్కడితో వదిలేసి కబీర్ సింగ్ చూడాలి. అప్పుడు కబీర్ కూడా అర్జున్ రెడ్డిలా బాగా నచ్చుతాడు. రెండింటినీ పోల్చి మాత్రం చూడొద్దు. ఇది రీమేకే కావొచ్చు. మా సినిమాకీ ఓ ఆత్మ ఉంది” అంటున్నాడు. అయితే తాను ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండని కలుసుకోలేదట. ”అర్జున్ రెడ్డి సినిమా చూసిన వెంటనే విజయ్‌ని కలవాలనుకున్నా. కానీ ఇప్పటి వరకూ కుదర్లేదు. దర్శకుడు సందీప్ విజయ్‌ని తీసుకొస్తానని చాలా సార్లు చెప్పాడు. కానీ కుదర్లేదు. ఈ సినిమా విడుదలయ్యాక కలుస్తామేమో” అంటున్నాడు.