ఆఫీస్ బాయ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ కమెడియన్గా తనకంటూ ఓ గుర్తింపు, అభిమానం తెచ్చుకున్న షకలక శంకర్ ‘శంభో శంకర’తో హీరోగా మారాడు. ఈ సినిమా విడుదల ఈ రోజే. సినిమా హిట్టా? ఫట్టా? అనేది పక్కన పెడితే… విడుదలకు ముందు షకలక శంకర్ ప్రవర్తన చర్చనీయాంశం అయ్యింది. త్రివిక్రమ్, రవితేజ, దిల్ రాజు, అల్లు శిరీష్ తదితరుల దగ్గరకు కథ పట్టుకుని వెళ్లి రెండు కోట్లు పెట్టి నిర్మించమంటే రెండేళ్లు ఆగమన్నారని వెటకారంగా వ్యాఖ్యానించాడు. ఆఫ్ ది రికార్డ్ అతడి ప్రవర్తన గురించీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మీ గురువుగారు వర్మని సినిమా ప్రొడ్యూస్ చేయమని అడగలేదా?’ అని అడిగితే.. ”ఆయన తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలే. హిట్స్ ఎక్కడివి” అన్నాడు. “నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’లో మీ పాత్రకు మంచి పేరు వచ్చింది కదా?” అని అడిగితే… “అసలు ఆ సినిమా ఆడిందా?” అన్నట్టు మీడియా ఇంటర్వ్యూలోనూ కాస్త వెటకారంగా సమాధానాలు చెప్పాడు. షకలక శంకర్ మాటల్లో వ్యంగ్యంకి, పొగరుకి అసలు కారణం ప్రీ రిలీజ్ బిజినెస్ అని టాక్. రెండు కోట్లతో తీసిన ఈ సినిమా బిజినెస్ దగ్గర దగ్గరగా ఆరు కోట్లు జరిగిందట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మలేదట. విడుదలకు ముందు నాలుగు కోట్ల లాభం కళ్ల చూడటంతో శంకర్ కళ్లు నెత్తికి ఎక్కాయనే మాటలు వినిపిస్తున్నాయి.