కామర్స్ చదివినోళ్లు వైద్యం చేస్తారా…? ఎకనమిక్స్ చదివిన వాళ్లు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తారా..? లెక్కలు చెప్పేవాళ్లు మొక్కల గురించి మాట్లాడతారా..?… ఇలాంటివేవీ జరగవు. కానీ… నిజంగా కామర్స్ చదివిన వాళ్లతో వైద్యం చేయించేవాళ్లు ఉంటారు..! ఎకనమిక్స్ చదివిన వాళ్లతో ల్యాబ్ లో ప్రయోగాలు చేయించేవాళ్లు ఉంటారు..! లెక్కలు చెప్పే వాళ్లతో మొక్కల గురించి చెప్పేవాళ్లు ఉంటారు.. కాకపోతే… చాలా అరుదుగా ఉంటారు. నూటికో కోటికో ఒక్కడు ఉంటారు. ఎలా ఉంటారంటే.. మన ప్రధానమంత్రి మోడీలా ఉంటారు. ఆయన హిస్టరీలో ఏంఏ చేసిన శక్తికాంత దాస్ ను రిజర్వ్ బ్యాంకర్ గవర్నర్ గా నియమించి చరిత్ర సృష్టించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన అత్యధిక కాలం ఆర్థిక వ్యవహారాలకు సంబంధం లేని వ్యవస్థల్లోనే పని చేసినా.. చెప్పినట్లు వింటారని.. నరేంద్రమోడీ శక్తికాంతదాస్ కు పట్టం కట్టారు.
దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో అత్యంత కీలకమైన ఆర్బీఐ గవర్నర్ పదవిని… జీహుజూర్ అనే వ్యక్తికి ఇవ్వాలనుకున్న మోడీ.. చివరికి శక్తికాంత దాస్ ను ఎంచుకున్నారన్న విమర్శలు ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మోడీ టీంలోని ఓ ఆర్థిక నిపుణుడు గుడ్ బై చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం వెనుక శక్తికాంత దాస్ ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక శాస్త్రంలో ఏ మాత్రం పట్టు లేని వ్యక్తులకు .. మోడీ దేశ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటి ఆర్బీఐని అప్పగిస్తున్నారన్న విమర్శలు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన 61 ఏళ్ల శక్తికాంత దాస్ 2017 మే నెలలో పదవీ విరమణ చేశారు. ఇప్పుడు ఏకంగా మూడేళ్ల పదవీ కాలానికి ఆర్బీఐ 25వ గవర్నర్ గా నియమించారు. ఆరు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న సందర్భంలో మూడేళ్లపాటు నియమించడం రాజకీయవర్గాల్లో మరో విమర్శలకు కారణం అవుతోంది.
ప్రస్తుతం ఆర్బీఐ ముందు పెను సవాళ్లు ఉన్నాయి.వాటిలో ప్రధానమైనది స్వయం ప్రతిపత్తిపై కేంద్రం చేస్తున్న దాడి. డైరెక్టర్ల బోర్డు ద్వారా ఆర్బీఐపై పెత్తనం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు రాకుండా.. శక్తికాంత దాస్ ను మోడీ నియమించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోడీనామిక్స్ ఇప్పటికే దేశాన్ని భ్రష్టుపట్టిస్తోంది ఇప్పుడు ఇదే కొత్త తరహా ఉపద్రవం వచ్చి పడిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంతకు ముందు ఆర్బీఐ గవర్నర్లుగా పని చేసిన వారంతా.. ఆర్థ శాస్త్రంలో ప్రపంచ ఖ్యాతి సాధించినవారే. కానీ శక్తికాంత దాస్ మాత్రం చరిత్ర చదువుకుని ఆర్బీఐ చీఫ్ గా వ్యవహరించబోతున్నారు.