అర్జున్ రెడ్డి చిత్రంతో షాలిని పాండే ఖాతాలో ఓ విజయం చేరింది. విజయం తరవాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదనేది వాస్తవం. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది.
అర్జున్ రెడ్డి విజయంతో షాలిని పాండేకి వచ్చిన లాభం ఏదైనా వుందంటే 100 పర్సెంట్ కాదల్ మాత్రమే. తెలుగులో విజయ్ దేవరకొండ చిత్రం సాధించిన విజయాన్ని చూసి తమిళంలో ఛాన్స్ ఇచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100 పర్సెంట్ లవ్ చిత్రానికి రీమేక్ అది. తరవాత తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ 118 చిత్రంలో ఇద్దరు కథానాయికల్లో ఒకరుగా నటించే అవకాశం వచ్చింది. మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశం షాలిని తలుపు తట్టలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ఓ అద్భుత అవకాశం వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన హిందీ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘బాంఫాడ్’లో షాలిని పాండేని కథానాయికగా తీసుకున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి సమర్పకుడు. అనురాగ్ చిత్రాలకు హిందీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ వుంటుంది. అందువల్ల, హిందీలో కథానాయికగా నటిస్తున్న తొలి చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తుందని షాలిని పాండే సంతోషంగా వుందట.