వరుసగా మూడు పరాజయాలతో పాయింట్స్ పట్టిన కిందన ఉంది చెన్నై సూపర్ కింగ్స్. వాట్సన్ చూస్తే ఫామ్ లో లేడు. `అసలు ఈ జట్టుకి వాట్సన్ అవసరమా?` అంటూ కోచ్నీ, కెప్టెన్ ని దుమ్మెత్తి పోశారు అభిమానులు. పంజాబ్‌తో మ్యాచ్ కి వాట్సన్ ని పక్కన పెడతారనుకున్నారంతా. కానీ.. ధోనీ వాట్సన్‌పై నమ్మకం ఉంచాడు. `నా జట్టులోంచి వాట్సన్ ని తప్పించను` అని ఖరాఖండీగా చెప్పాడు. అనుకున్నట్టే పంజాబ్ తో మ్యాచ్‌లో వాట్సన్ ని మళ్లీ తీసుకున్నారు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ వాట్సన్ చెలరేగిపోయాడు. ఒక్కటంటే ఒక్క తప్పుడు షాటూ ఆడకుండా – మ్యాచ్ ని గెలిపించాడు. తన ఆట తీరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు.
వాట్సన్ ఇంతలా ఆడడం గొప్పకాదు. అది తనకు అలవాటే. కానీ ఈసారి చెప్పి మరీ కొట్టాడు. పంజాబ్ తో మ్యాచ్ కి 24 గంటల ముందు `చెన్నైకి ఓ పర్ఫెక్ట్ మ్యాచ్ రాబోతోంది` అంటూ ట్వీట్ చేశాడు. అనుకున్నట్టే వాట్సన్ పర్ఫెక్ట్గా ఆడాడు. పది వికెట్ల తేడాతో చెన్నైని పర్ఫెక్ట్ గా గెలిపించాడు. వాట్సన్ భవిష్యత్తు ఊహించేశాడు అంటూ… చెన్నై అభిమానులు వాట్సన్ ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆర్చర్ నాలుగు సిక్సులు కొట్టి – అలరించాడు. అయితే.. కొన్నాళ్ల క్రితమే నాలుగు సిక్సులు కొట్టబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు ఆర్చర్. చూస్తుంటే… ఈసారి ఐపీఎల్ అంతా గతంలోనే `డిసైడ్` అయినట్టు లేదూ..?