‘భారతీయుడు2’తోనే శంకర్ పని అయిపోయిందని అంతా పెదవి విరిచారు. ఎక్కడో చిన్న ఆశ మిణుకు మిణుకుమంటున్నా అది కాస్త `గేమ్ చేంజర్`తో పోయింది. శంకర్ ఇంకా పాత కాలపు కథల్ని, స్క్రీన్ ప్లేని నమ్ముకొంటున్నాడని, అందులోంచి బయటకు రాకపోతే, శంకర్ మళ్లీ ట్రాక్ ఎక్కడం కష్టమని విశ్లేషకులు తేల్చేశారు. గేమ్ చేంజర్ తరవాత శంకర్ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. మళ్లీ ఇంతింత బడ్జెట్లు శంకర్‌కి దొరక్కపోవొచ్చు. స్టార్ హీరోలూ శంకర్ ని ఇది వరకటిలా నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. పైగా శంకర్ స్టేట్మెంట్లు కూడా తన స్టామినాపై కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి.
‘గేమ్ చేంజర్’ రిజల్ట్ పై శంకర్ మాట్లాడుతూ, ఇది 5 గంటల సినిమా అని, దాన్ని కుదించడం వల్ల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మిస్ అయ్యాయని, లేదంటే ఫలితం బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓ సినిమా ఎంత నిడివి ఎండాలి? ఫైనల్ కట్ ఎంత ఉంటుంది? అనే కనీస స్పృహ శంకర్‌కి లేకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా 3 గంటలే. మరి శంకర్ 5 గంటల సినిమాని ఎలా ఆలోచించాడు? అంటే 5 గంటల సినిమా తీసి దాన్ని రెండున్నర గంటల పాటు కుదించాడా? మరో రెండున్నర గంటల ఫుటేజీ వేస్ట్ అయినట్టే కదా? అంటే.. నిర్మాత తాలుకూ కష్టం, నటీనటులు సాంకేతిక నిపుణుల శ్రమ ఆ మేరకకు వృధా అయినట్టే కదా?
నిజానికి 5 గంటల సినిమా వచ్చినప్పుడు, అందులో సీన్స్ అన్నీ బాగున్నప్పుడు 2 భాగాలుగా మార్చ వచ్చు కదా? భారతీయుడు 2 విషయంలో ఇదే జరిగింది కదా? మరి అదే గేమ్ ఛేంజర్‌కి ఎందుకు అప్లయ్ చేయలేదు? రెండున్నర గంటల సినిమానే ప్రేక్షకులకు బోర్ కొట్టినప్పుడు దాని లెంగ్త్ ఇంకాస్త పెంచితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యేది కదా? ఈ విషయాలన్నీ శంకర్ గుర్తించకపోతే ఎలా? గంటల కొద్దీ ఫుటేజీలు తీసి, దాన్ని తలా తోక లేకుండా కట్ చేసి, మిగిలిన ఫుటేజీ అంతా డస్ట్ బిన్లో పడేస్తే ఆ దర్శకుడికి విజువల్ సెన్స్ లేనట్టే. ఇలాంటి స్టేట్ మెంట్లు శంకర్‌ని ఇంకా నమ్ముతున్న వాళ్లకు సైతం ఇబ్బందిగా అనిపిస్తాయి.