రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘2.ఓ’ బడ్జెట్ ఎంత? చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 75 మిలియన్ డాలర్స్ అని మొన్నీమధ్య ప్రకటించింది. భారతీయ కరెన్సీలో 545 కోట్ల రూపాయలు! ఈ ఫిగర్ చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. సినిమా ప్రారంభించినప్పుడు అంత బడ్జెట్ అనుకోలేదు. మేకింగ్‌లో, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌లో బడ్జెట్ పెరిగింది. సినిమాకు అంత ఖర్చయ్యిందా? నిర్మాతలు మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా చెప్పారా? అని సందేహాలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ బడ్జెట్ గురించి మాట్లాడారు. 70 నుంచి 75 మిలియన్ డాలర్స్ మధ్య బడ్జెట్ వుంటుందని, అది కూడా పబ్లిసిటీతో కలిపి అంత అవుతుందని ఆయన తెలిపాడు. నిర్మాతలు రౌండ్ ఫిగర్ చేసి 75 మిలియన్ డాలర్స్ చెప్పారని చెప్పాడు. ఇంకా శంకర్ మాట్లాడుతూ “సినిమాకు మరింత బడ్జెట్ అవసరం అవుతుంది. కాని మేం ఇంత మాత్రమే పెట్టగలమని, మా శక్తి ఇంతవరకూ వుందని ఆగాము. బడ్జెట్లో మూడోవంతు వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి కేటాయించాం” అని తెలిపాడు. సినిమా విడుదల ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంపై కూడా శంకర్ మాట్లాడారు. “వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేపట్టిన కంపెనీ మధ్యలో చేతులు ఎత్తేయడంతో తొలిసారి వాయిదా వేసాం. తరవాత మరో కంపెనీ 2018 జనవరికి వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పడంతో దుబాయ్‌లో ఆడియో ఫంక్షన్ చేశాం. చివరికి వచ్చేసరికి వాళ్ళు కూడా పని పూర్తి కాదని చెప్పారు. పలు వాయిదాల తరవాత వచ్చే నవంబర్ 29కి వస్తున్నాం” అని శంకర్ తెలిపాడు.