రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే తెరకెక్కిస్తారు. ప్రస్తుతం శంకర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన లొకేషన్ల వేటలో బిజీ. మరోవైపు… రామ్ చరణ్ కోసం రకరకాల గెటప్పుల్ని సిద్ధం చేస్తున్నారు. వాటిలో ఫొటో షూట్ చేశాక.. ఓ గెటప్ ని ఫైనల్ చేస్తారు. స్కెచ్ ఆర్టిస్టులు, మేకప్ నిపుణులతో శంకర్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. శంకర్ సినిమాల్లో.. హీరో రకరకాల గెటప్పులలో కనిపించడం అలవాటు. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ద్విపాత్రాభినయం ఉన్నా, కాకపోయినా.. చరణ్ కి కొత్త లుక్ లో చూపించాలన్నది శంకర్ ఆలోచన. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.