గేమ్ ఛేంజర్ టీజర్ మెగా ఫ్యాన్స్ కు కావల్సినంత కిక్ ఇచ్చింది. `ఐ యామ్ అన్ ప్రెడిక్టబుల్` అనే డైలాగ్… ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. హీరో క్యారెక్టరైజేషన్‌ని కాస్త కాస్తగా రివీల్ చేసి, ఆ క్యారెక్టర్‌పై ఆసక్తి పెంచారు. దానికి తోడు.. శంకర్ మార్క్ విజువల్స్ భారీగా కనిపించాయి. దాంతో పాటుగా ’30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా’ అనే పుస్తకంపై కూడా అందరి దృష్టీ పడింది. ఈ టీజర్ లో ఓ చోట చరణ్ ఈ పుస్తకం చదువుతూ కనిపించాడు. హీరోకి కోపం ఎక్కువ అనే విషయాన్ని కూడా డైలాగుల ద్వారా కన్వే చేశారు. దాంతో చరణ్ క్యారెక్టర్ ని ఫ్యాన్స్ చూసే కోణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
హీరోకి కోపం, యాంగర్ మేనేజ్మెంట్ అనగానే సందీప్ రెడ్డి వంగా తీసిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా గుర్తొస్తుంది. ఆ తరవాత చాలామంది ఆ పేట్రన్‌లో హీరోల పాత్రలు రాసుకొన్నారు. ‘యానిమల్`లో హీరోని మరో స్థాయిలో చూపించాడు సందీప్ రెడ్డి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ క్యారెక్టర్ కూ `కోపం` అనే ఎలిమెంట్ యాడ్ చేశాడు శంకర్. కాకపోతే శంకర్ బలం.. ట్రీట్మెంట్. బలమైన సామాజిక అంశాన్ని కథలో మేళవిస్తారాయన. సందీప్ రెడ్డి క్యారెక్టరైజేషన్ కి, శంకర్ ట్రీట్ మెంట్ జోడిస్తే ఆ ఫ్లేవర్ పూర్తిగా మారిపోతుంది. గేమ్ ఛేంజర్‌లోనూ ఆ మ్యాజిక్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాలో హీరో పాత్రని ఇంట్రడ్యూస్ చేసే సీన్ కూడా కోపం అనే ఎలిమెంట్ తో ముడి పడి ఉంటుందని తెలుస్తోంది. కాలేజీ లైఫ్, అక్కడి గొడవల ఎపిసోడ్ తోనే హీరోని పరిచయం చేస్తారని సమాచారం. ఆ తరవాత ఐపీఎస్ గా మారడం, ఐఏఎస్ అవ్వడం, చివరికి.. సీ.ఎం పీఠంలో కూర్చోవడం వీటన్నింటికీ కారణం హీరోకి వచ్చే కోపమేనట. అయితే ఆ కోపం ఎందుకు, ఎవరి కోసం అనేది ఆసక్తికరమైన అంశం. టీజర్ తో వచ్చిన హైప్‌తో సినిమాపై నమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్ రావాల్సివుంది. డిసెంబరులో ట్రైలర్‌ని విడుదల చేస్తారు. జనవరిలో రిలీజ్ ట్రైలర్ కూడా ఉండబోతోంది.