ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎపిసోడ్ ఇంకా కొనసా….గుతూనే ఉంది. కే సముద్రంలో జరిగిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రీతి మీనాను ఆయన తాకారనీ, దాంతో ఆమె మనస్థాపానికి గురికావడం, తరువాత శంకర్ నాయక్ తో సారీ చెప్పించడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుందని అనుకుంటే అక్కడితో ఆగలేదు. విషయం అరెస్టు దాకా వెళ్లింది. మెహబుబాబాద్ స్టేషన్ కు వచ్చిన ఆయనే స్వయంగా లొంగిపోయారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనకి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చారు. అయినాసరే, అధికారుల వాదన మాత్రం తీవ్రంగానే ఉంది! ఎమ్మెల్యేని క్షమించేదే లేదనీ, ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాదన మరోలా ఉంది!
ఆమెకు తన చెయ్యి తగిలిందట, దాంతో ఆమె హర్ట్ అయ్యారట అని తనకు తెలిసిందనీ, పబ్లిక్ లో అనుకోకుండా తగిలితే తగిలుండొచ్చని శంకర్ నాయక్ అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. కలెక్టర్ తనకు సోదరిలాంటి వారనీ, ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా జరిగి ఉంటే క్షమించండి అంటూ చెప్పానని వివరించారు. ఈ విషయాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేయని నేరానికి అనవసరంగా తనతో క్షమాపణలు చెప్పించారనీ, మినిస్టర్ మాటను గౌరవించి ఆమె దగ్గరకి వెళ్లాననీ, పొరపాటున ఏదైనా జరిగి ఉంటే క్షమించమని కోరానన్నారు. తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతోందనీ, సొంత పార్టీ వాళ్లా, వేరే పార్టీ వాళ్లా అనేది తనకు అర్థం కావడం లేదని శంకర్ నాయక్ చెప్పారు. కలెక్టర్ ను గతంలో తాను ఇబ్బంది పెట్టానంటూ వినిపిస్తున్న ఆరోపణల్లో కూడా నిజం లేదన్నారు.
అయితే, అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై కఠిన చర్యలు ఉండాలనే అంటున్నారు. ఇంకోపక్క.. కలెక్టర్ సంఘం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఘటనకు సంబంధించిన వివరాలతోపాటు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పందన, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలను సమావేశంలో చర్చించింది. మరోపక్క.. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా గట్టిగానే పట్టుకుంటున్నాయి! మహిళల రక్షణ కోసం షీ టీమ్ లు పనిచేస్తున్నాయనీ, అలాగే అధికార పార్టీ నాయకుల నుంచి ప్రభుత్వోద్యోగాల్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించాలేమో అంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపాలనీ, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అంటోంది. ఇక, తెలుగుదేశం కూడా ఇదే అంశంపై విమర్శలకు దిగింది. జిల్లా కలెక్టర్ విషయంలో గత ఆరు నెలల నుంచీ ఎమ్మెల్యే వ్యవహార శైలి సరిగా ఉండటం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో జనగామ జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎమ్మెల్యే యాదగిరిపై కూడా చర్యల్లేవన్నారు. తెరాస ప్రభుత్వంలో ఐ.ఎ.ఎస్.లకే రక్షణ లేని పరిస్థితి అంటూ రేవంత్ విమర్శించారు.
చినికి చినికి గాలీవానా అన్నట్టుగా.. క్షమాపణలతో ముగుస్తుంది అనుకున్న శంకర్ నాయక్ వ్యవహారం ఇంకా బిగుసుకుంటోంది. కలెక్టర్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు బాధాకరమనీ, అందుకే క్షమాపణలు చెప్పించామనీ, ఇకపై చట్టం తన పని తాను చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనడం కూడా గమనార్హం. అధికారులేమో కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రభుత్వంపై విమర్శకు దొరికిన మరో అస్త్రంగా మార్చేసుకున్నాయి. ఆయనేమో చేయని తప్పుకు తనతో సారీ చెప్పించారని అంటున్నారు! ఇది ఎలా ముగుస్తుందో మరి!